Idream media
Idream media
వ్యాక్సిన్ విధానంపై కేంద్రంపై ఒత్తిడి తెద్దాం అంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి బయలుదేరడం ఆసక్తికరంగా మారింది. వరుసగా ప్రధానమంత్రికి లేఖలు రాయడం, ఇప్పుడు నేరుగా కేంద్ర పెద్దలను కలిసేందుకు వెళ్తుండడంపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితమే వ్యాక్సినేషన్ పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వాటిలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎంలకు రాసిన లేఖల ద్వారా బహిర్గతం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు.
ఈ నెల 7న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సీఎం క్యాంప్ అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, విభజన సమస్యలు, వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ రాయడంతో ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు సాయంత్రం సీఎం జగన్..అమిత్ షా తో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసారు. కానీ, ఇతర రాష్ట్రాల కంటే తక్కవ మొత్తంలో వ్యాక్సిన్లు ఏపీకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు. దీని పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ అంశం పైన అమిత్ షా భేటీలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏపీలో కోటి మందికి పైగా వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. కేంద్రం సహకరిస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ప్రజలు అందరికీ వ్యాక్సిన్ వేసే సత్తా తమకు ఉందని జగన్ గతంలోనే ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి ఏపీకి వ్యాక్సిన్ డోస్ లు అందడం లేదు. సీఎం నేరుగా ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరినప్పటికీ, ఏ రాష్ట్ర్రానికి ఎప్పుడు ఎన్ని పంపాలనేది కేంద్ర ఆదేశాల ప్రకారమే పంపిణీ చేయాల్సి ఉండడంతో నేరుగా రాని పరిస్థితి. ఈ క్రమంలో జగన్ ఢిల్లీ ప్రయాణంపై అంతటా ఆసక్తి ఏర్పడింది. ఇప్పటి వరకూ లేఖల ద్వారా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి విన్నవించిన ఆయన ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్నారు.