iDreamPost
android-app
ios-app

కేంద్ర హోం మంత్రితో జగన్ భేటీ, కీలకాంశాలపై చర్చ

  • Published Dec 16, 2020 | 2:04 AM Updated Updated Dec 16, 2020 | 2:04 AM
కేంద్ర హోం మంత్రితో జగన్ భేటీ, కీలకాంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సీఎం ఆయన ముందు ప్రస్తావించారు. ఏపీకి సంబంధించిన నిధులు, ఇతర అంశాలను సీఎం ఆయన దృష్టికి తెచ్చారు. పలు అంశాలలో సానుకూలంగా స్పందినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని సీఎం జగన్ కోరారు. దానికి సంబంధించి కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్ల రూపాయలను రియింబర్స్‌ చేయాల్సి ఉందని జగన్ తెలిపారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని ప్రస్తావించారు.

ఏపీలో ఇటీవల కాలంలో వరదలు, తుఫాన్లు మూలంగా తీవ్ర నష్టం వాటిల్లిందని , కేంద్రం ఆదుకోవాలని జగన్ కోరారు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన వర్షాల కారణంగా పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన చేసిందని, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. నివర్‌ తుపాను తర్వాత నష్టం అంచనాకోసం కేంద్రం తరఫున బృందాన్ని ఏర్పాటు చేశారని, త్వరగా వీరు రాష్ట్రంలో పర్యటించి నష్టంపై లెక్కలు తయారుచేసి కేంద్రానికి సమర్పించాల్సి ఉందని హోంమంత్రికి వివరించారు.
కోవిడ్ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఫలితాలను సీఎం వివరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయడానికి ఉద్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా హోంమంత్రిని సీఎం కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 2013–14 నుంచి 2018–19 వరకూ ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి ఇంకాచెల్లించాల్సి ఉన్న రూ.1600 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. అంతేగాకుండా 2020 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రానికి రూ.4308.46 కోట్ల రూపాయలు ఉన్న జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని హోమంత్రిని సీఎం కోరారు.

15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు బకాయిలు, 14వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు బకాయిపడ్డ రూ. 1111.53 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయన కోరారు. ఉపాథిహామీ పథకంలో భాగంగా పెండింగులో ఉన్న రూ.3,801.98 కోట్లను విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన సీఎం. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ కాలేజీలు చాలా కీలమని హోంమంత్రికి వివరించారు.

మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ మరియు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులకు వెంటనే ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తిచేయాలంటూ కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం. ఈ బిల్లులను ఇప్పటికే పంపామని తెలియజేశారు. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసనరాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టంకూడా చేశామని గుర్తుచేసిన సీఎం. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్‌ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్‌ జారీచేయాలని కోరిన సీఎం. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని ప్రస్తావించారు.