iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ కి విశేష ఆదరణ ఉందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందు ఆయన తెలుగు ప్రజల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. కానీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆయన హవా కనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తర్వాత అత్యంత ఎక్కువ మంది సెర్చ్ చేసిన నేతగా వైఎస్ జగన్ కి గుర్తింపు రావడం అందుకు తార్కాణం. అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ సోషల్ బృందం కృషి దానికి ప్రధాన కారణం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసుకున్న విభాగాలు కీలకంగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారంలోనూ, ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.
ఇటీవల తెలంగాణా కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునంద్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైఎస్సార్ మరణం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ప్రతిఫలం చెల్లించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సాగించిన క్యాంపెయిన్ ఫలితమే. అధికారం, పదవులతో సంబంధం లేకుండా సుదీర్ఘకాలంగా జగన్ కి అత్యధిక సంఖ్యలో అభిమానుల బలం ఉంది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నేతల్లో ఆయన ముందుంటారు. ఆన్ లైన్ లో ఆయన పేరు మోగ్రుతున్న తీరు అందుకు ఉదాహరణ. చెక్ బ్రాండ్ అనే సంస్థ లేటెస్ట్ రిపోర్ట్ లో మోదీ తర్వాత జగన్ కి విశేషమైన గుర్తింపు ఉన్నట్టు తేల్చేసింది.
విపక్ష నేతగా జగన్ తనదైన శైలిలో ప్రజలకు చేరవయ్యారు. ముఖ్యమంత్రిగానూ అదే పంథాలో సాగుతున్నారు. సగటు రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు సాగిస్తూ, అభివృద్ధికి అదే స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ రెండింటి మేళవింపు కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్లలు వేస్తున్న శకునులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో సోషల్ మీడియా అండ జగన్ కి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పవచ్చు. వాస్తవానికి రెగ్యులర్ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో జగన్ కన్నా ఆయన వ్యతిరేకుల ప్రభావమే ఎక్కువ. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైఎస్సార్సీపీ కొన్నాళ్లుగా గట్టి పట్టు సాధించింది. అందుకు స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల బలం ఎంతో ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు పార్టీ పిలుపులు, ఏ నాయకుడి ఆదేశాలు లేకుండానే స్వచ్ఛందంగా కదిలే జగనన్న సైన్యం ఎంతటి ప్రభావం చూపగలదో రఘునందన్ రావు ఎపిసోడ్ చాటుతోంది.
ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాలు మరింత చొరవ చూపేందుకు దోహదపడుతున్నాయి. వివిధ కార్యక్రమాలను కింది స్థాయికి తీసుకెళ్లేందుకు తోడ్పడుతున్నాయి. విస్తృత ప్రచార కార్యక్రమాలకు అటు కంటెంట్ పరంగానూ, ఇటు విధాన పరంగానూ ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితానిస్తున్నాయి. వాస్తవానికి జగన్ కన్నా సీనియర్ ముఖ్యమంత్రులు, పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులున్నప్పటికీ జగన్ కార్యక్రమాల వైపు దేశమంతా చూసేలా చేయడంలో సోషల్ మీడియా ప్రధాన సాధనం అవుతోంది. అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అనుసరించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్న తీరు గమనించవచ్చు. డిజిటల్ రంగంలో చేస్తున్న ప్రయత్నాల పరంపర అందుకు ప్రధాన చోదక శక్తి అవుతోంది.
నాడు-నేడు వంటి పథకాలు, దిశ చట్టం, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేసిన చట్టాలు, సామాజికంగా పలు మార్పులు తీసుకొచ్చేలా గ్రామీణ పాలనను గాడిలో పెట్టిన సచివాలయ వ్యవస్థ, మూడు రాజధానుల పేరుతో పాలనా వికేంద్రకరణకు పడుతున్న అడుగులు అన్నీ జగన్ వ్యూహాన్ని చాటుతున్నాయి. సుదీర్గకాలం పాటు ఏపీలో తిరుగులేని రాజకీయ నేతగా కొనసాగేందుకు ఇలాంటివి తోడ్పడతాయనడంలో సందేహం లేదు. ఆయన ఆశిస్తున్నట్టు 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగేందుకు, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు వ్యవస్థలో వస్తున్న మార్పులు దోహదం చేస్తాయి. అదే సమయంలో ఇటీవల పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం రీత్యా ఆ వేదికలపై కార్యకలాపాలకు జగన్ అభిమాన సైన్యం. సోషల్ మీడియా గ్రూపులతో పాటుగా ప్రభుత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విభాగాల పాత్ర కీలకంగా మారబోతోంది. ప్రజలకు ప్రభుత్వాన్ని చేరవ చేసి, సీఎం ఆశయాలను లక్ష్యాలను అర్థమయ్యేలా చాటేందుకు ప్రయోజనకారిగా మారుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజా సర్వేలో జగన్ కి దేశంలో టాప్ 2 నేతగా నిలవడం. భవిష్యత్ లో ఆయన ప్రభావం మరింత పెరుగుతుందనడానికి సంకేతాన్నిస్తోంది.