Idream media
Idream media
కరోనా మొదటి దశలో కీలక నిర్ణయాలు తీసుకుని పరీక్షలు, కట్టడిలో దేశంలోనే ముందంజలోనే నిలిచి శభాష్ అనిపించుకున్న ఏపీ సీఎం జగన్.. రెండో దశను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నియంత్రణలో ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఎవరి ప్రాణమూ పోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఏమేం అవసరాలు ఉన్నాయో మీరు చెప్పండి.. ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేస్తా.. ఎక్కడా ఏదీ లోటు రాకూడదంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్ మార్కెట్ పై కఠినంగా ఉండాలని సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. ఏం చేస్తారో నాకు అనవసరం.. వీలైనంత వరకూ ఏ ప్రాణమూ పోకుండా కాపాడడమే నాకు ముఖ్యం అంటూ కీలక సూచనలు చేస్తున్నారు జగన్.
బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం
‘ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు, సరఫరాను హేతుబద్ధీకరించండి. అలాగే కోవిడ్ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్ ఇంజక్షన్లు కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్ మార్కెట్ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్ ఉంటే దాన్ని పూర్తిగా అరికట్టాలి. దాని కోసం ఎస్‌ఓపీ రూపొందించండి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్, రెమిడిస్‌వర్ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేకపోతే ఇక్కడ కేసులు పెరిగితే, ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి’. అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ అధికారులను సన్నద్ధం చేస్తున్నారు.
ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరించండి
కొవిడ్ రెండో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. ఆ మేరకు రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించండి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయండి.. అంటూ సీఎం కీలక సూచనలు చేశారు. అలాగే, ‘పరీక్షల సంఖ్య కూడా అవసరం మేరకు పెంచండి. కోవిడ్ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతో పాటు, ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే పరీక్ష చేయాలి. వీలైనంత వరకు ఎవరి ప్రాణం కూడా పోకుండా కాపాడాలి. అది మనకు చాలా ముఖ్యం’. ‘కోవిడ్ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే రైడ్స్ చేయండి. అందుకు అవసరమైతే ఒక సీనియర్ అధికారిని నియమించండి’.
ఫోన్ చేసిన వెంటనే స్పందించాలి
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, 104 కాల్ సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలని జగన్ సూచించారు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క అధికారి ఓన్ చేసుకోవాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే తమకు సాయం చేశారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్ సెంటర్‌ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు ఆ కాల్ సెంటర్‌లో కూర్చుని మానిటర్ చేయాలి’. ‘అవసరమైనన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయండి. వాటిలో తగిన సదుపాయాలు ఉండేలా చూడండి’ అని వైరస్ నేపథ్యంలో పాటించాల్సిన కర్తవ్యాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.
స్వయంగా ఫోన్ చేసిన సీఎం
కొవిడ్ నియంత్రణకు కేంద్ర పెద్దలు, పలు సంస్థల నిర్వాహకులతో సీఎం జగన్ నేరుగా ఫోన్ చేసి అప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అధికారులపై బాధ్యత వదిలేయకుండా స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్ డోస్ లు, రెమిడిసివిర్ ఇంజక్షన్ల పై భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు, హెటెరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోస్‌లతో పాటు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సీఎం జగన్ కొన్ని సార్లు సీరియస్ గా, కొన్నిసార్లు సున్నితంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారు.