Idream media
Idream media
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలపై ఇటీవల నెలకొన్న సందిగ్ధత పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణంపై చలామణిలోకి వచ్చిన ఊహాగానాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెరదించారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. పోలవరంతోపాటు ఆరు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.
సోమశిల ప్రాజెక్టు రెండో దశ పనులకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. హైలెవల్ లిఫ్ట్‌కెనాల్ రెండో దశతో 46, 543 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు జరిగేలోపు సోమశిల రెండో దశను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు. పెన్నా నది నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పనులు వేగంగా చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం జగన్ తెలిపారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును హడావుడిగా చేపట్టింది. 527 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిందని సీఎం జగన్ గుర్తు చేశారు. అవినీతికి తావులేకుండా ప్రాజెక్టు పనులు చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం జగన్ తెలిపారు. అందుకే రివర్స్ టెండర్లు పిలిచామని వెల్లడించారు. గత ప్రభుత్వం 527 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు చేస్తే.. తమ ప్రభుత్వంలో 459 కోట్లకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారని వివరించారు. రివర్స్ టెండర్లలో 68 కోట్ల రూపాయలు ఆదా చేసి గత ప్రభుత్వం చేసిన అవినీతికి చెక్ పెట్టామని జగన్ వ్యాఖ్యానించారు.