iDreamPost
android-app
ios-app

AP CID, Ex IAS Lakshminarayana – ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సోదాలు.. సీఐడీని అడ్డుకున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ

AP CID, Ex IAS Lakshminarayana – ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సోదాలు.. సీఐడీని అడ్డుకున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ

గత ప్రభుత్వ హాయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ రోజు మాజీ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుడుగా పని చేసిన లక్ష్మీ నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు. అయితే సీఐడీ అధికారులను లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని లక్ష్మీ నారాయణ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధా కృష్ణ ఉన్నారు. అతను కూడా సీఐడీ అధికారులు లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు చేయకుండా అడ్డుకోవడం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 241.78 కోట్ల రూపాయల నిధులు మింగేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీమన్స్, డీజైన్‌ టెక్‌ అనే సంస్థలు.. షెల్‌ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమికంగా దర్యాప్తు చేసిన ప్రభుత్వం.. నిధుల మళ్లింపు నిజమేనని నిర్థారించుకున్న తర్వాత ఈ ఏడాది జూలై 11వ తేదీన సీఐడీ విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వం వాటా 370.78 కోట్ల రూపాయల నుంచి సీమన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు 241.78 కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో.. జగన్‌ సర్కార్‌ ఈ కుంభకోణం గుట్టురట్టు చేసేందుకు సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ స్కాంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు చేసింది. లక్ష్మీ నారాయణ చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సలహదారుడుగా పని చేశారు. 

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఓ ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకోసం తన వాటాగా 370.78 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టులో రూపాయి కూడా వెచ్చించని సీమన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు.. ఏపీ వ్యాప్తంగా వివిధ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు భోగస్‌ ఇన్వాయిస్‌లు సృష్టించి 241.78 కోట్ల రూపాయలను మళ్లించేశాయి.

Also Read : Chandrababu ,Lokesh – మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడికి ఎంత క‌ష్టం..!