iDreamPost
android-app
ios-app

జగన్ క్యాబినెట్ కూర్పులో మార్పులకు ముహూర్తం ఖరారయ్యిందా

  • Published Feb 02, 2022 | 5:57 AM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
జగన్ క్యాబినెట్ కూర్పులో మార్పులకు ముహూర్తం ఖరారయ్యిందా

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మార్పులకు ముహూర్తం ఖరారయినట్టు ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరిలోనే దానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారనే కథనాలు వస్తున్నాయి. నిజానికి రెండున్నరేళ్ల గడువు పెట్టిన ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా గత ఏడాది చివరిలోనే మార్పులు చేస్తారని చాలామంది భావించారు. అయితే కోవిడ్ సహా వివిధ కారణాలతో మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల విషయంపై సీఎం పునరాలోచనలో పడ్డారు. దాని కారణంగా మరికొంతకాలం పాటు మార్పులు ఉండకపోవచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే తీరా ఇప్పుడు ఏపీ క్యాబినెట్ లో కొత్త మొఖాలకు అవకాశం ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నారనే సమాచారం ఆసక్తి రేపుతోంది.

2019 జూన్ లో క్యాబినెట్ ఏర్పడింది. ఆ సందర్భంగా వైఎస్సార్సీఎల్సీ మీటింగ్ లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. చాలామంది సీనియర్లు మంత్రి పదవుల రేసులో ఉన్న తరుణంలో అందరినీ సంతృప్తిపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం మంత్రివర్గంలో తీసుకున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. అదే సమయంలో తన టీమ్ లోకి పలువురు యువకులను తీసుకున్నారు. తొలిసారి మంత్రి పదవి దక్కిన వారే అత్యధికంగా జగన్ క్యాబినెట్ లో ఉన్నారు. ఐదుగురు మినహా మిగిలిన వారంతా అనుభవం లేని వారే అయినప్పటికీ ఏపీ క్యాబినెట్ కీలక సమయంలో సమర్థవంతంగా వ్యవహరించడం జగన్ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా కోవిడ్ వంటి సమయాల్లో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం ఏపీ సర్కారు తీరుని చాటిచెప్పింది. దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంది.

Also Read : మాజీమంత్రి కిడారికి చంద్రబాబు హ్యాండిచ్చారా?

ఈ తరుణంలో కొత్తవారికి అవకాశాలు వస్తాయనే అంచనాతో పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ తాను క్యాబినెట్ లోకి తీసుకున్న వారిలో ఇద్దరు సీనియర్లను మధ్యలో రాజ్యసభకు పంపించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కూడా గతంలో వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వారిద్దరినీ గత ఏడాది రాజ్యసభకు పంపించడంతో వారి స్థానంలో మరో ఇద్దరు కొత్త వారికి అవకాశం దక్కింది. దాంతో దాదాపుగా అందరూ జగన్ మంత్రివర్గ సహచరులుగానే అనుభవం సంపాదించడం విశేషం. దాంతో వారి స్థానంలో మళ్లీ కొత్త వారికి ఛాన్సిస్తారా లేదా ఈసారి సీనియర్లకు పట్టం గడతారా అనే చర్చ సాగుతోంది.

పలువురు నేతలు మాత్రం కుల, ప్రాంతీయ సమీకరణాలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగన్ పట్ల విధేయత ఆధారంగా ఈసారి తమకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే జగన్ దగ్గర లాబీయింగ్ కి అవకాశం లేదు కాబట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నవారిలో కొందరు కొనసాగుతారని దాదాపుగా అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకేసారి మొత్తం మంత్రులందరినీ మార్చేసే బదులుగా సమర్థతతో పాటుగా పార్టీ అవసరాల ప్రాతిపదికన కొందరినీ ఆయా స్థానాల్లో ఉంచుతారని భావిస్తున్నారు. దాంతో ఎంతమందిని కొనసాగిస్తారు, కొత్తగా ఎవరికి చోటిస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇక మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ వచ్చినందున అక్కడి నుంచి కూడా ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని భావిస్తున్న తరుణంలో ఆ లిస్టులో ఎవరుంటారన్నది కూడా కీలకమే.

ఫిబ్రవరి రెండోవారంలో క్యాబినెట్ మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. మూడోవారంలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈనెలాఖరులో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న తరుణంలో సమావేశాలకు ముందుగా క్యాబినెట్ మార్పులు చేస్తారా లేదా బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ వ్యవహారం ఉంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అందుకు తోడుగా ప్రస్తుతం ఏపీలో పీఆర్సీ సహా కొన్ని సమస్యల మీద చర్చ సాగుతున్న తరుణంలో సీఎం మంత్రివర్గం విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిని బట్టి క్లారిటీ వస్తుంది.

Also Read : ఎన్టీఆర్‌ బంధువు, మాజీ మంత్రి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు ఇకలేరు