iDreamPost
android-app
ios-app

ఎల్జీ పాలిమర్స్‌పై కేబినెట్‌ కీలక నిర్ణయం

ఎల్జీ పాలిమర్స్‌పై కేబినెట్‌ కీలక నిర్ణయం

పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంఘటనలకు దేశంలో కొదవే లేదు. ఘనట జరిగినప్పుడు బాధితులకు పరిహారం ఇచ్చి చేతులు దుపుకుని, పరిశ్రమ చుట్టుపక్కల నివాసం ఉండే వారి ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వాలను ఇప్పటి వరకూ చూశాం. ఈ తరహా తీరుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ అంశంపై వ్యవహరించింది. ఈ రోజు జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో.. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంతోపాటు 39 అంశాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఎల్జీ కంపెనీ వల్ల భవిష్యత్‌లో మళ్లీ ప్రజలకు కష్టం కలగకుండా, అదే సమయంలో యాజమాన్యానికి నష్టం లేకుండా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కంపెనీని అక్కడ నుంచి మరోచోటకు తరలించాలని నిర్ణయించింది. ఆ స్థలంలో ప్రమాదరహిత కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఎల్జీకి అనుమతి ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది.

2020 మే 7వ తేదీన విశాఖ సమీపంలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో తెల్లవారుజామున ప్రమాదకర స్టెర్లిన్‌ వాయువు లీక్‌ కావడంతో కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లో 12 మంది చనిపోయారు. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి.

Also Read : ఆడుతోంది రఘురామే కానీ ఆడిస్తోంది ఎవరు?

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించిన ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు, బాధితులకు పరిహారాన్ని అందించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పన, తీవ్ర అస్వస్థతకు గురైన వారికి పది లక్షల రూపాయల చొప్పన, కంపెనీ చుట్టుపక్కల ఐదు గ్రామాల్లోని వారికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పన పరిహారం అందించింది. యాజమాన్యంపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. అయితే కంపెనీని అక్కడ నుంచి తరలించాలనే డిమాండ్‌ను స్థానికులు ప్రభుత్వం ముందు ఉంచారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం కంపెనీ తరలింపుపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆ కమిటీ 350 పేజీల నివేదికను ఇచ్చింది. ప్రమాదం జరగడానికి గల కారణాలను, ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని ఆ నివేదికలో పొందుపరిచింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని తాజాగా కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో బాధిత గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు గ్రీన్‌సిగ్నల్‌