Idream media
Idream media
దేశమంతా ప్రైవేటు బాట పడుతోంది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ విధానాలను అవలంభిస్తూ పేదలకు ఉచిత సేవలను దూరం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రభుత్వ రంగాలను బలోపేతం చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రభుత్వ విద్య, వైద్య రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆయా రంగాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తూ పేదలకు ఉచిత సేవలను దగ్గర చేస్తోంది. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారిన విధానం కళ్ల ముందే కనిపిస్తోంది. అలాగే వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు జగన్. కొవిడ్ చికిత్సను కూడా ఆరోగ్య శ్రీలోకి చేర్పిన ఘనత ఆంధ్రప్రదేశ్ దే.
కరానో తొలి దశలో పేదలు అందరికీ ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను తన ఆధీనంలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో వేలాది బెడ్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా అందరికీ వేగంగా వైద్యం అందింది. ఇప్పుడు రెండో దశలో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్న సీఎం జగన్ వైరస్ కట్టడికి, త్వరితగతిన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, మందులు పెంచడమే కాకుండా చిన్న ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రాథమిక వైద్య రంగం పేదలకు మరింత అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతీ ఏజెన్సీ మండలానికీ మూడు పీహెచ్‌సీలు, ప్రతీ మైదాన మండలానికి 2 పీహెచ్‌సీలను అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అంతేకాకుండా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతానికి కృషి చేస్తున్నాం. కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. 558 ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నాం. 100కుపైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 24 గంటల్లోనే కరోనా టెస్ట్ రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశాం. కోవిడ్ బాధితుల కోసం 44, 599 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. రెమిడెసివిర్ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం’’ అని వివరించారు. ఏదేమైనా విపత్కర సమయంలో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు జగన్ ప్రభుత్వం చూపుతున్న చొరవ చర్చనీయాంశంగా మారుతోంది.