Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన బ్రాండ్‌థాన్ లోగోల పోటీకి విశేష స్పందన లభించింది. ఏకంగా 47 వేల మంది ఔత్సాహికులు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను ప్రతిబించించేలా తొమ్మిది రేకులతో వికసించిన పుష్పంతోపాటు ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. దీనికి క్యాప్షన్‌గా ‘సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే అక్షరాలను చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన సిద్దార్థ దీన్ని రూపొందించారు. అలాగే ఇంగ్లిష్‌లో ఉన్న ఏపీ అనే లెటర్స్ ఒకదాటికొకటి చేతులు కలిపినట్లుగా ఉన్న లోగోకు రెండో స్థానం వచ్చింది. ‘కలసి కట్టుగా ఎదుగుదాం’ అనే శీర్షికను దీనికి జోడించారు. ఏపీ అక్షరాలను నిర్మాణం చేస్తున్నట్లుగా ఉంటూ పారదర్శక పాలనకు ప్రతీకగా రూపొందించిన లోగో తృతీయ బహుమతి పొందింది.
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్, పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవలతో కూడిన కమిటీ విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి కింద రూ. 50వేలు, రెండో బహుమతి కింద 25 వేలు, మూడో స్థానంలో ఉన్న లోగోకు 10వేలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానోత్సవం జరగనుంది. గతేడాది అక్టోబర్ 10న న్యూఢిల్లీలో బ్రాండ్‌థాన్ పోటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 4 వరకు గడువు విధించగా 47వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.