iDreamPost
android-app
ios-app

AP BJP, Jinnah Tower – ఏపీ బీజేపీ న‌యా వ్యూహాలు.. ఇప్పుడు జిన్నా టవర్ మీద రాజకీయం..

AP BJP, Jinnah Tower – ఏపీ బీజేపీ న‌యా వ్యూహాలు.. ఇప్పుడు జిన్నా టవర్ మీద రాజకీయం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నిల‌దొక్కుకునే ప్రయ‌త్నాల్లో.. కొత్త ఎత్తులు వేస్తూ కొన్ని చిక్కులు తెచ్చుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ మ‌రిన్ని వివాదాల‌కు ఆజ్యం పోస్తోంది.. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే ప్ర‌శాంతంగా పాల‌న సాగుతున్న రాష్ట్రంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు సృష్టించే ల‌క్ష్యంతో విప‌క్షాలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయా.. అనే అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. లిక్క‌ర్ పై చీఫ్ కామెంట్లు చేసి.. ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు నిన్న సంచ‌ల‌నంగా మారితే.. మ‌రోవైపు.. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేత స‌త్య‌కుమార్ ఇప్పుడు మ‌రో వివాదానికి ఆజ్యం పోశారు. గురువారం ఆయ‌న చేసిన ట్వీట్ వెనుక అస‌లు ల‌క్ష్యం వేరే ఉందా అనే అభిప్రాయాలూ వ్య‌క్తం అవుతున్నాయి.

స్థానిక నేత‌ల ఆజ్యం..

ఆ బీజేపీ నేత టార్గెట్ గా గుంటూరు జిన్నా ట‌వ‌ర్ నిలిచింది. గ‌తంలో కూడా దీనిపై వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ.. మ‌రోసారి దీన్ని తెర‌పైకి తెచ్చారు. “ఇది పాకిస్తాన్ లో కాదు.. గుంటూరు న‌గ‌రంలో ఉన్న ట‌వ‌ర్. దీనికి భార‌త దేశ ద్రోహి జిన్నా, ఈ ప్రాంతానికి జిన్నా సెంట‌ర్ అని పేరు పెట్టారు. డాక్ట‌ర్ క‌లాం లేదా ద‌ళిత క‌వి, గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టకూడ‌దు? ఇది కేవ‌లం ఒక ఆలోచ‌న” అని తాజాగా ట్వీట్ చేశారు. దీనికి స్థానిక నేత‌లు మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాస్త‌వ ప్రాతిప‌దిక‌న చ‌ర్చ జ‌ర‌గాల్సిన అంశమ‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వ‌స్తే పేరు మార్చేస్తామ‌ని కూడా అంటున్నారు. దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి, ర‌క్త‌పాతాన్ని సృష్టించిన జిన్నా పేరు ఎందుకంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. జిన్నా సెంట‌ర్ పేరు తొల‌గించాల్సిందే అంటూ దీనికి తెలుగుదేశం వైఖ‌రి కూడా చెప్పాల‌ని వివాదం పెంచ‌డానికి తోడు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Also Read : నిన్న జీవీఎల్‌… నేడు సోము అప్పులు చేస్తే రాష్ట్రాలే దివాళా తీస్తాయా?

అస‌లు ఎందుకాపేరు పెట్టారంటే..

గుంటూరు లోని ఆ ప్రాంతానికి జిన్నా సెంట‌ర్ పేరు పెట్ట‌డం వెనుక భిన్న వాద‌న‌లు ఉన్నాయి. ఆ జిల్లాలోని ప్ర‌ముఖ వ్యాపార కూడ‌ళ్ల‌లో జిన్నా సెంట‌ర్ ఒక‌టి. స్వాతంత్ర్యానికి పూర్వ‌మే.. ముస్లింలీగ్ నేత‌గా ఉన్న జిన్నా గౌర‌వార్థం ఈ ట‌వ‌ర్ నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. 1942 – 45 మ‌ధ్య ఈ నిర్మాణం జ‌రిగిన‌ట్లు అధికారిక ప‌త్రాలు చెబుతున్నాయి. అప్పుడు గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ జాన్ భాషా సార‌థ్యంలో ఈ టవ‌ర్ నిర్మాణం జ‌రిగింద‌ని వారి కుటుంబీకులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కొమ‌ర‌పురి గ్రామంలో హిందూ – ముస్లిం భావ‌న ఏర్ప‌డి త‌గాదాలు ఏర్ప‌డిన కేసుల్లో ప‌ద్నాలుగు మంది ముస్లిం సోద‌రుల‌కు జీవిత శిక్ష ప‌డింద‌ని, ఆ శిక్ష ర‌ద్దు అయ్యేలా జిన్నా కేసు వాదించార‌ని, ఆయ‌నకు కృత‌జ్ఞ‌త‌గా త‌మ పూర్వీకులు ఈ ట‌వ‌ర్ నిర్మించారని లాల్ జాన్ భాషా కుటుంబీకులు చెబుతున్నారు.

గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక క‌ట్ట‌డానికి పాకిస్తాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెడితే.. ఈ కట్టడం నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉండ‌డం విశేషం. అందుకే ఈ ప్రాంతాన్ని శాంతి, సామరస్యాలకు చిహ్నంగా స్థానికులు భావిస్తారు. దీనిపై రెండు క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. జిన్నా ప్రతినిధి గుంటూరు నగరానికి వ‌చ్చిన‌ప్పుడు, ఆ సందర్భానికి చిహ్నంగా లాల్ జాన్ భాషా ఈ టవర్ నిర్మించార‌ని, రెండోది, గుంటూరు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, తెల్లాకుల జాలయ్య పదవీకాలంలో శాంతి సామరస్యాలకు చిహ్నంగా దీనిని కట్టించారని చెబుతుంటారు. ఆరు స్తంబాల మీద నిలబడి, పైన గుమ్మటపు కప్పు (డోమ్) ఉన్న కట్టడం.

ఇప్పుడెందుకు దీనిపై వివాదం

కాగా, శాంతి సామ‌ర‌స్యాల‌కు చిహ్నంగా, స్వాతంత్ర్యానికి పూర్వమే ముస్లిం లీగ్ నేత‌గా ఉన్న జిన్నాకు గౌర‌వార్థంగా త‌దిత‌ర కార‌ణాల‌తో ఈ టవర్ పెట్టిన‌ట్లు క‌థ‌నాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈ ట‌వ‌ర్ నిర్మాణం జ‌రిగి ద‌శాబ్దాలు గ‌డిచిపోయాయి. మ‌రి బీజేపీ ఇప్పుడే ఎందుకు దీనిని తెర‌పైకి తెస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ముస్లిమేత‌రులు ఎక్కువ‌గా ఆ సెంట‌ర్ కు జిన్నా పేరు పెడితే.. గుంటూరు లోని ముస్లిం ల వ్యాపార స‌ముదాయం మాయాబ‌జార్ కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పేరు ఉండ‌డం లౌకిత‌త్వానికి ప్ర‌తీక‌గా గుంటూరువాసులు భావిస్తున్నార‌న్న విష‌యం బీజేపీ నేత‌లు తెలుసుకుంటే మంచిద‌నే సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read : బీజేపీ ఫోకస్‌ పెడితే వైఎస్సార్‌ సీపీ నేతల అడ్రస్‌లు గల్లంతట!