Idream media
Idream media
వినాయక చవితి ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకు పదవులు పండుగ వచ్చింది. 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమిస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మునుపటి మాదిరిగానే అన్ని వర్గాల వారికి పదవుల భర్తీలో సమప్రాధాన్యతను ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలు వెల్లడించారు.
మహిళలకు 52 శాతం..
మొత్తం 481 పదవుల్లో అన్ని వర్గాల వారిని నియమించారు. జిల్లాలకు సమప్రాధాన్యం కల్పించారు. మొత్తం పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించగా.. మిగిలిన 42 శాతం పదవులను ఓసీలకు ఇచ్చారు. అన్ని సామాజికవర్గాలకు చెందిన మహిళలకు 52 శాతం పదవులను కేటాయించిన ప్రభుత్వం మరోమారు మహిళలకు పెద్దపీట వేసింది.
Also Read : కార్పొరేషన్ డైరెక్టర్ పదవి- ఇంటికి వెళుతుండగాప్రమాదం జరిగి మరణం
నెలన్నరలోనే డైరెక్టర్ల పదవులు..
జూలై 17వ తేదీన వివిధ కార్పొరేషన్లు, డెవెలెప్‌మెంట్ అథారిటీలు, జిల్లా సహకార బ్యాంకుల చైర్మన్లు, అధ్యక్షుల పోస్టులను జగన్ సర్కార్ భర్తీ చేసింది. మొత్తం 135 మందిని ఆయా పదవుల్లో నియమించింది. ఇది జరిగిన నెలన్నరలోనే ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించడంతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. పార్టీ కోసం కష్టపడి పని చేసినందుకు తగిన గుర్తింపు లభించడంతో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.
ఏడాదిలోపే 1,344 నామినేటెడ్ పోస్టులు భర్తీ..
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత సీఎం వైఎస్ జగన్ నామినెటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. గత ఏడాది కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్ సర్కార్.. ఆయా కార్పొరేషన్లకు గత ఏడాది అక్టోబర్‌లో 56 మంది చైర్మన్/చైర్‌పర్సన్లను, 672 మంది డైరెక్టర్లను నియమించింది. ఈ ఏడాది జూలైలో వివిధ కార్పొరేషన్లు, డెవెలెప్‌మెంట్ అథారిటీలకు 135 మంది చైర్మన్లు, అధ్యక్షులను నియమించగా.. తాజాగా 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమించింది. గడిచిన ఏడాది కాలంలో వైసీపీ నేతలకు మొత్తం 1,344 నామినేటెడ్ పోస్టులు దక్కడం విశేషం.
Also Read : అనంతలక్ష్మి నాయకత్వం మాకొద్దంటున్న కాకినాడ తమ్ముళ్లు