iDreamPost
android-app
ios-app

కొవిడ్ పై పోరుకు అధిక నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం ఏపీ..!

కొవిడ్ పై పోరుకు అధిక నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం ఏపీ..!

వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? కాంట్రాక్ట‌ర్ల‌కు పెట్టేందుకు సొమ్ములుంటాయా, క‌రోనా నియంత్ర‌ణ‌కు డ‌బ్బులు వెచ్చించ‌లేరా? ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు అన్న మాట‌లు ఇవి.

సంక్షేమ పథకాలకు 20 నెలల్లోనే రూ.90 వేల కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సీఎం జ‌గ‌న్.. టీకా కోసం నిధులు ఖర్చు పెట్టరంటే ఎవరైనా నమ్ముతారా? మీ అకౌంట‌ర్ నెంబ‌ర్ ఇవ్వండి 1600 కోట్లు అందులో జ‌మ చేస్తాం.. అంద‌రికీ టీకా ఇప్పించ‌గ‌ల‌రా? ఏపీ మంత్రి కొడాలి నాని కౌంట‌ర్.

చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు, కొడాలి కౌంట‌ర్ అలా ఉంచితే, వాస్త‌వంగా క‌రోనా కోసం ఏపీ అధిక నిధులు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు లెక్క‌లు చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతున్నా కూడా కేసులు ఏ మాత్రం తగ్గ‌డం లేదు. ఇదిలా వుంటే .. కరోనా విజృంభణ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అల్లాడిపోతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఇంకా కరోనా జోరు తగ్గడం లేదు. మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అధిక నిధులు వెచ్చిస్తోంది. వైరస్ మహమ్మారి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా ను అరికట్టడం కోసం సుమారు 2249 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో పాటు కరోనా కేర్ కేంద్రాలు ఆర్టీపీసీఆర్ ల్యాబ్ల నిర్వహణ వాటికి కావాల్సిన కిట్లు మందులు రసాయనాలు.. తదితరాలకు భారీగా ఖర్చు పెట్టింది. 2020 ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ఆ తర్వాత కరోనా వెలుగులోకి వచ్చిన కొత్త లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి నమూనాలు పంపించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్రాల్లోనే లాబ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపుగా రోజుకి లక్షకి పైగా కరోనా నమూనాలని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. గతేడాది అంటే ఫస్ట్ వేవ్ లో 18 వేల మంది సిబ్బందిని నియమించగా సెకండ్ వేవ్ లో 19 వేల మందికి పైగా సిబ్బంది నియామకానికి ఆమోదం వచ్చింది. ఇప్పటికే 18 వేల మంది విధుల్లో చేరారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ‘‘బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం’’ అన్నారు. అలాగే క‌రో్నా సోకి త‌ల్లిదండ్రులు చ‌నిపోయిన పిల్ల‌ల పేరిట రూ. 10 ల‌క్ష‌లు వేయాల‌ని కూడా తాజాగా నిర్ణ‌యించారు. వీటిని ప‌రిశీలిస్తే క‌రోనా క‌ట్ట‌డిలో ఏపీ విశేష సేవ‌లందిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.