iDreamPost
iDreamPost
కాదెవరూ కరోనాకు అనర్హం అన్న స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్, బిగ్ బి అమితాబచ్చన్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖుల జాబితా భారీగా ఉంటోంది. నిత్యం తగు జాగ్రత్తలతో ఉండే వారే వైరస్ భారిన పడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. వీరు కాక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది.
వీటన్నింటిని తరచి చూసేత వైరస్ వ్యాప్తి విషయంలో సామాజిక వ్యాప్తి దశలోకి చేరుకున్నామా? అన్న అనుమానాలు కూడా బలంగానే విన్పిస్తున్నాయి. అధికారికంగా దీనిపై ప్రకటనలు వెలువడకపోయినప్పటికీ పరిస్థితి చూస్తే అలాగే ఉందన్నది పలువురు నిపుణులు ‘అనధికారికం’గా చెబుతున్న మాట. దీని తగ్గట్టుగానే ఉత్తర ప్రవేశ్‌లో ఒక మహిళా మంత్రి, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుల మృతికి ఈ వైరస్సే కారణం కావడం కూడా ఆందోళనలు పెంచేదిగానే ఉంటోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జనంలో ఉన్న నిర్లక్ష్యమే ప్రస్తుతం వైరస్ ఉధృత వ్యాప్తికి కారణమన్న వాదనలు కూడా లేకపోలేదు. లాక్డౌన్ ప్రారంభంలో వైరస్ భారత్‌లాంటి దేశాల్లో వినాశం సృష్టిస్తుందని విదేశీయులు చెబితే వారిపై పలువురు మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే వారి అనుమానాలే నిజమయ్యేలాంటి పరిస్థితులు కన్పిస్తున్నాయి.
గుర్తించిన పలు హాట్‌స్పాట్‌లు, రెడ్ జోన్‌లలో కోవిడ్ 19 వ్యాప్తి భారీగానే ఉంటోంది. కానీ ప్రజల్లో మాత్రం జాగ్రత్తలు కన్పించడం లేదు. పూజలు, పండుగలు, ఫంక్షన్‌లు ఇలా ఏదో ఒక కారణంతో జనం రోడ్లమీదకు చేరి, గుంపులుగుంపులుగానే సంచరిస్తున్నారు. వీరిని అడ్డుకోలేక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ప్రస్తుతం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రజల వద్ద ఉన్నవి మూడేమూడు ఆయుధాలు ఒకటి మాస్క్, రెండు భౌతిక దూరం, మూడు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం. వీటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా వైరస్ దాడికి గురికాక తప్పదని ప్రజలు గుర్తించాల్సిన అవసరముంది.