iDreamPost
iDreamPost
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చక్కని గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆశించిన పెద్ద స్థాయికి వెళ్లకపోయినా తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. శతమానం భవతి, అఆ, ప్రేమమ్ గత ఏడాది వచ్చిన రాక్షసుడు తనకు మంచి పేరే తీసుకొచ్చాయి. మధ్యలో వచ్చిన కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు లాంటివి మాత్రం దారుణ ఫలితాన్ని ఇచ్చాయి. వీటి సంగతలా ఉంచితే తెలుగులో అనుపమ ఓ సర్వైవల్ థ్రిల్లర్ లో నటించబోతోందని ఫిలిం నగర్ టాక్. గత ఏడాది మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ హెలెన్ కు రీమేక్ ఇది.
ఒక చికెన్ రెస్టారెంట్ ఫ్రీజర్ రూమ్ లో హీరోయిన్ చిక్కుకుపోతే ఒంటరిగా శ్వాస తీసుకోలేక ప్రాణం నిలుపుకోవడానికి చేసే పోరాటాన్ని అందులో అద్భుతంగా చూపించారు. టైటిల్ రోల్ చేసిన అన్నా బెన్ కు గొప్ప పేరు తీసుకొచ్చింది హెలెన్. హిందీలో జాన్వీ కపూర్ తో పునఃనిర్మాణం చేసేందుకు బోనీ కపూర్ రెడీగా ఉన్నాడని ఇప్పటికే టాక్ ఉంది. దీన్నే తెలుగులో అనుపమ పరమేశ్వరన్ తో తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇదే నిజమైతే పెర్ఫార్మన్స్ కు గొప్ప స్కోప్ ఉన్న ఇలాంటి పాత్ర దక్కడం అనుపమ లక్కీ ఛాన్స్ అనుకోవాలి. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అనుపమ ప్రస్తుతం టాలీవుడ్ లో కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ ఒప్పుకున్నట్టుగా సమాచారం. ఆయా యూనిట్లు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
వీటితో కలిపి మొత్తం మూడు సినిమాలు ఒప్పుకున్నట్టు అవుతుంది. లాక్ డౌన్ కు ముందు హెలెన్ ను ఇక్కడ రీమేక్ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేశారు. అయితే అన్నా బెన్ తో సరితూగే ఆర్టిస్ట్ ని పట్టుకోవడం అంత సులభం కాదు. అనుపమ అయితే పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. మాతృభాషలో ఒకరు చేసిన పాత్రని ఇంకో లాంగ్వేజ్ లో తాను చేయాల్సి రావడం అనుపమకు వెరైటీ ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోవచ్చు. థ్రిల్లర్స్ కి మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో హెలెన్ లాంటివి తెలుగు ప్రేక్షకులకూ నచ్చే అవకాశాలు లేకపోలేదు. అందులోనూ మనకూ బాగా పరిచయమున్న అనుపమ అయితే ఎక్కువ జనానికి రీచ్ అవుతుంది. కాకపోతే కరోనా తగ్గిపోయి షూటింగులు తిరిగి పూర్తి స్థాయిలో జరిగే దాకా ఇలాంటి ప్రకటనల కోసం వెయిట్ చేయాల్సిందే