iDreamPost
android-app
ios-app

నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్శింహ స్వామి కళ్యాణం

  • Published Feb 11, 2022 | 9:46 AM Updated Updated Feb 11, 2022 | 9:46 AM
నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్శింహ స్వామి కళ్యాణం

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా… ఆది దేవునిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి కళ్యాణం శుక్రవారం జరగనుంది. ఆది దేవుడు అంతర్వేది నర్శింహస్వామి కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత నర్శింహస్వామి కళ్యాణం ఈ రోజు అర్థరాత్రి 12.35 గంటలకు మృగశిర నక్షిత్రయుక్త వృశ్చికలగ్న పుష్కరాంశంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణం జరిపించనున్నారు. ఇప్పటికే అంతర్వేది కళ్యాణోత్సవాలు ఆరంభమయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా అంతర్వేదిలో ఆరంభమైన కళ్యాణోత్సవాల్లో ఆధ్యాత్మికశోభ పరిఢవిల్లుతోంది. ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణం ఒక కీలకఘట్టం. ఉభయ గోదావరితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వస్తున్నారు.

అంతర్వేది ఆలయం వెలిసిన ప్రాంతానికి ఆధ్యాత్మికంగా గొప్ప చరిత్ర ఉంది. సాగరమధనం సమయంలో భూమి పుట్టినప్పుడు తొలుత ఈప్రాంతమే తేలిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ వెలిసిన లక్ష్మీనర్శింహస్వామిని ఆదిదేవుడు అని భక్తులు పిలుస్తారు. పైగా ఇది గోదావరి తీరం.. పైగా వశిష్ఠ నదీ సంగమ ప్రాంతంలో వెలిసిన స్వామివారు. పైగా ఈ ప్రాంతం త్రికోణాకారపు దీవిలా ఉంటుంది. చుట్టూ పైరు పచ్చని ప్రకృతి మధ్యలో ఆలయం ఉంది. ఇటువంటి ప్రాంతంలో వెలిసిన నర్శింహుని ఆలయం అతి ప్రాచీనం. ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవితో కలిసి కొలువయ్యారు. స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. నిత్యం వందల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు. ఇక కళ్యాణ సమయంలో వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. విద్యుత్‌ దీపాలతో అలంకరించిన కళ్యాణం జరిగే ప్రాంతం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. బంగారం, వజ్రవైడూర్యాలతో చేయించిన ఆభరణాలు అలంకరించిన కళ్యాణమూర్తులు.. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే కళ్యాణం చూసేందుకు భక్తుల రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.

కళ్యాణానికి ముందు స్వామివారిని పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడు వాహనాల మీద ఊరేగిస్తారు. కళ్యాణం కోసం ఆలయం ఎదుట చలువు పందెర నిర్మించారు. వేలాది మంది భక్తులు కూర్చుని కళ్యాణం చూసేందుకు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కళ్యాణం అనంతరం భక్తులు తెల్లవారు జామున సముద్ర స్నానాలకు వెళ్లి అనంతరం స్వామివారిని దర్శిస్తారు. శనివారం మధ్యాహ్నం 2.35 గంటల సమయంలో స్వామివారి రథోత్సవం జరగనుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు ఈ మూడు కార్యక్రమాల్లో కూడా పాల్గొని తరువాత తమ గమ్యస్థానాలకు చేరతారు. 

కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు తిప్పుతున్నారు. అమలాపురం, రావులపాలెం, రాజోలు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం నుంచి 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా వందలాది ద్విచక్ర, సొంత కార్లతో భక్తులు అంతర్వేది వస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల భద్రత కోసం 1,500 మంది పోలీసులు, 134 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బీచ్‌ వద్ద 60 మంది గజఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

Also Read : రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహా కాళేశ్వరాలయం