iDreamPost
iDreamPost
తెలుగులో క్రీడలను ఆధారంగా చేసుకుని వచ్చిన బయోపిక్స్ తక్కువే అని చెప్పాలి. నాని జెర్సీ విడుదలయ్యాక దానికి వచ్చిన స్పందన ఇంకొందరికి స్ఫూర్తినిచ్చిన మాట వాస్తవం. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. చక్ దే ఇండియాతో మొదలుకుని మేరీ కోమ్, పాన్ సింగ్ తోమర్, భాగ్ మిల్కా భాగ్ ఇలా చాలానే ఉన్నాయి. అందులో అధిక శాతం విజయం సాధించాయి కూడా. టాలీవుడ్ లో గత ఏడాది కౌసల్య కృష్ణమూర్తి కూడా పర్వాలేదు అనిపించుకుంది కాని స్టార్ సపోర్ట్ లేకపోవడం వల్ల పెద్ద రేంజ్ కు వెళ్ళలేదు.
ఇప్పుడు మరో స్పోర్ట్ బయోపిక్ కి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. నేను లోకల్, సినిమా చూపిస్త మావా, హలో గురు ప్రేమ కోసమేలతో స్టార్ రైటర్ గా ఎదిగిన బెజవాడ ప్రసన్న కుమార్ ప్రస్తుతం తన శైలికి భిన్నంగా ఒక సీరియస్ స్పోర్ట్ డ్రామాను స్క్రిప్ట్ రూపంలో సిద్ధం చేసినట్టుగా తెలిసింది. సుప్రసిద్ధ వాలీ బాల్ ప్లేయర్ అరికెపూడి రమణరావు కథను సినిమాగా మలచబోతున్నట్టు వినికిడి.
1978లో అర్జున అవార్డు, 1991లో ద్రోణాచార్య పురస్కారం అందుకున్న రమణారావు కెరీర్ తొలిదశలో ప్రభుత్వం నుంచి కోచ్ లను ఏర్పాటు చేసేందుకు నిస్సహాయత చూపినప్పుడు తోటి క్రీడాకారులకు తనే శిక్షకుడిగా మారి ఎన్నో విజయాలు అందించారు. అందుకే వయసులో పెద్దవారు కూడా ఆయన్ను సర్ అని పిలిచేవారు.
ఇంకా ఎన్నో ఘనతలు, అంతకు మించి అవమానాలు, పోరాటాలు రమణారావు జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు దీన్నే వెండితెరపై తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో ఇంకా ఖరారు కానీ దర్శకుడితో త్వరలోనే ప్రకటన కూడా ఉండొచ్చని అంటున్నారు. లాక్ డౌన్ అయ్యాక కానీ అధికారికంగా చెప్పలేని పరిస్థితి. నాని లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ అయితే ఇలాంటి బయోపిక్స్ ని మార్కెట్ తో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. ఇప్పుడు నానితో ఛాన్స్ లేదు కానీ ఇంకో హీరోని అయితే సెట్ చేసుకోవాలి.