iDreamPost
android-app
ios-app

బ్యాంకులకు బడాబాబుల మరో కుచ్చుటోపి

బ్యాంకులకు బడాబాబుల మరో కుచ్చుటోపి

దేశంలో మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బ్యాంకులు వ్యవహరిస్తున్నట్లు తాజా ఘటన మరోసారి రుజువు చేస్తోంది. రుణాలు ఎగ్గొట్టి నాలుగేళ్ళ క్రితం విదేశాలకు పారిపోతే.. తీరిగ్గా ఇప్పుడు బ్యాంకులు ఫిర్యాదు చేసాయి. సిబిఐకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

బ్యాంకులు చేసిన ఫిర్యాదు ఆధారంగా బాస్మతి రైస్ ఎక్స్ పోర్ట్ కంపెనీ అయిన రాందేవ్ ఇంటర్నేషనల్ ప్రమోటర్లు ముగ్గురు పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ డైరెక్టర్లు నరేష్ కుమార్, సురేష్ కుమార్, సంగీతలు ఎస్ బి ఐ బ్యాంకు కన్సారియం నుంచి 411 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఇందులో ఎస్బిఐ నుంచి 173 కోట్లు రుణాలు తీసుకోగా మిగతా రుణం..కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్నారు.

ఎస్ బి ఐ తాజాగా చేసిన ఫిర్యాదులో కొత్త ట్విస్ట్ ఏమిటంటే.. ఈ కంపెనీ తీసుకున్న రుణాలు 2016 లోనే ఎన్ పి ఏ లుగా మారిపోవడం. ఎన్ పి ఏ లుగా మారిన తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ఎస్బిఐ.. సిబిఐకి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలుగించే అంశం. ఇన్ని రోజులుగా ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేదానికి ఎస్బిఐ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానం విడ్డూరంగా ఉంది. 2016 నుంచి ఈ కంపెనీ పై విచారణ జరుగుతుండగా అప్పటినుంచి వారు అజ్ఞాతం లో ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్పుకొస్తున్నారు.

రాందేవ్ ఇంటర్నేషనల్ కంపెనీ పశ్చిమ ఆసియా, యూరోపియన్ కంపెనీలకు బాస్మతి రైస్ ను ఎక్స్ పోర్ట్ చేస్తుంది. కంపెనీకి 3 రైస్ మిల్లులు, 8 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని ఎస్బిఐ తన ఫిర్యాదులో పేర్కొంది. సౌదీ అరేబియా, దుబాయ్ లో కూడా ఈ కంపెనీకి బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపింది. అయితే కంపెనీ రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్ల లోని మిషనరీ, ఇతర యంత్రాలు ఇంట్లో ఉన్న మిల్లులు గ్రేడింగ్ యంత్రాలను కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే తరలించారని ఎస్బిఐ చెప్పడం విడ్డురంగా ఉంది. అప్పటి వరకు బ్యాంకు అధికారులు ఏమి చేస్తున్నారో వారికే ఎరుక.

ఏదైనా సంస్థ, వ్యక్తి రుణం తీసుకున్న తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఒక వాయిదా కూడా చెల్లించకపోతే ఆ రుణం.. ఎన్ పీ ఏ గా మారుతుంది. మూడేళ్లపాటు వాయిదాల కట్టకుండా, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు కనిపించకుండా పోయిన ఎస్బిఐ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్ల లోని యంత్రాలు, సామాగ్రి కూడా తరలించారు బ్యాంకు అధికారులు చెప్పడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పవచ్చు.