iDreamPost
iDreamPost
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా ఓ సలహాదారుడిపై వేటు వేసింది. అది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచనలతోనే అని చెబుతుండడం విశేషంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్ కే సాహూ పదవీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సాంకేతిక మరియు న్యాయ సలహాదారు హోదాలో సాహు ఉన్నారు. ఆయన తొలగింపు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హెచ్ కే సాహును గత టిడిపి ప్రభుత్వం నియమించింది. అప్పట్లో నెలకు రూ .2 లక్షల వేతనంతో చంద్రబాబు ప్రభుత్వం టెక్నికల్ అండ్ లీగల్ కన్సల్టెంట్ హోదాలో బాధ్యతలు అప్పగించింది. ఆయన హైదరాబాద్ లోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమన్వయం చేస్తారని తెలిపింది. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఆయన ద్వారా ఏపీ నీటిపారుదల శాఖకు గానీ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవహారాలకు గానీ ప్రయోజనం లేదని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దాంతో చివరకు ఆయన్ని పదవి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
గతంలో హెచ్ కే సాహు పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గోదావరి మరియు కృష్ణ రివర్ మేనేజ్మెంట్స్ రెండింటికి ఛైర్మన్ గా పనిచేసిన అనుభం కూడా ఉంది. అయినప్పటికీ ఆయన తన అనుభవానికి తగ్గట్టుగా విధులు నిర్వహించలేకపోతుండడం, ఆయన పనితీరు పోలవరం నిర్మాణానికి పెద్దగా ప్రయోజనకరంగా కనిపించకపోవడంతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయానికి వచ్చిందా అనే అభిప్రాయం కలుగుతోంది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ హయంలో జరగిన నియామకాల్లో కొందరు నేతలు స్వచ్ఛందంగా వైదొలిగారు. మరికొందరిని ప్రభుత్వం సాగనంపింది.
తాజాగా అదే జాబితాలో సాహు చేరినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు సాహు స్థానంలో కొత్తగా నిపుణులు ఎవరైనా నియమిస్తారా లేక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రతిష్టాత్మక అడుగులు వేస్తున్న ప్రభుత్వం అలాంటి సలహాదారులు అవసరం లేదని భావిస్తుందా అన్నది త్వరలోనే స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.