iDreamPost
android-app
ios-app

వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్

  • Published Jun 09, 2022 | 8:00 PM Updated Updated Jun 09, 2022 | 8:05 PM
వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్‌ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్‌(ఏపీడీసీ) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా APDC వాట్సాప్‌ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఇంటర్‌నెట్‌ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతను గుర్తించిన వాట్సాప్‌ ఇండియా ఏపీడీసీ వాట్సాప్‌ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ మరింత వేగంగా అందనున్నాయి.

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చేపట్టి సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్‌ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావించి ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తి స్థాయి వాట్సాప్‌ చాట్‌బోట్‌ సేవలను అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్‌ చాట్‌బోట్‌ సేవలు ఉపయోగపడనున్నాయి.

APDC వైస్‌ చైర్మన్‌, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి దీని గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతిశీల అజెండాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకూ మధ్య డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు సాయపడుతుంది అని తెలిపారు.

అలాగే వాట్సాప్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ అధిపతి శివనాథ్‌ ఠూక్రాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో E-గవర్నెన్స్‌ మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన E-గవర్నెన్స్‌ పరిష్కారాలు రూపొందించేందుకు మా వాట్సాప్‌ వ్యాపార వేదిక ద్వారా మేం నిరంతరం పనిచేస్తాం. వీటివల్ల పౌరులతో వేగవంతమైన, సులభతరమైన,మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సత్సంబంధాలు జరిపేందుకు వీలవుతుంది. మేం రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలకు అందించి, వాటితో కలిసి పని చేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తాం అని తెలిపారు.