iDreamPost
iDreamPost
ఆంధ్రజ్యోతి సంస్థ అన్నింటా అతి చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. చివరకు తాజాగా కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో కూడా తన ధోరణి చాటుకుంది. అందుకు తగ్గట్టుగా తమ పత్రిక గొప్పతనాన్ని చాటుకునే యత్నంలో విస్మయకర రీతిలో వ్యవహరించింది. ఆంధ్రజ్యోతి పత్రిక పూర్తి శానిటైజ్డ్ అంటూ చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి పత్రికల ద్వారా జరుగుతుందనే చర్చ నేపథ్యంలో సదరు చేసిన సంస్థ చెబుతున్న విషయం వైద్యరంగ నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది.
పత్రికల ద్వారా వైరస్ వ్యాప్తి ఉండదని ఇప్పటికే పలు వైద్య సంస్థలు చెబుతున్నాయి. వివిధ పత్రికలు కూడా దానిని పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాలు కూడా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజల్లో అపోహలు తొలగించి, వారికి అవసరమైన పరిజ్ఞానం అందించడం అవసరం అనే చెప్పక తప్పదు. ముఖ్యంగా పత్రిక పంచేందుకు సిద్ధపడే పేపర్ బాయ్స్ కూడా చాలా చోట్ల ఇంటింటికీ పేపర్ చేరవేసే పనికి రావడం లేదు. పత్రికల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే ప్రధానం దానికి ఓ ప్రధాన కారణం. పేపర్ బాయ్ లేకపోతే ఏ పత్రికయినా పాఠకులకు చేరడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటి అపోహలు తొలగించే యత్నం అబినందనీయం.
అంతటితో సరిపెట్టకుండా ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ని నేరుగా పీఎం తనకు ఫోన్ చేసినట్టు రాసుకున్న చందంగా ఇప్పుడు శానిటైజ్డ్ పత్రికగా చెప్పుకోవడం ఆరోగ్య పరిభాషలో అంతుబట్టని విషయంగా మారింది. వాస్తవానికి ప్రజల్లో ఉన్న అపోహలకు అసలు కారణం ముద్రణలో మాత్రమే కాకుండా పత్రికను ప్రింటింగ్ నుంచి వివిధ దశల్లో చేరవేసే క్రమంలో వైరస్ చేరుతుందనేది. దానికి గానూ ముద్రణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తమ పత్రికతో వైరస్ వ్యాప్తి ఉండదనే రీతిలో ఆంధ్రజ్యోతి చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. తాము మాత్రమే అలా చేస్తున్నామని చెప్పడం ద్వారా ఆందోళన పెంచడానికి ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు అవగాహన పెంచడానికి దోహదపడదన్నది పలువురి వాదన.
దాదాపు అన్ని పత్రికలూ అదే పంథాను పాటిస్తున్నప్పటికీ తాము మాత్రమే ప్రత్యేకంగా అన్నట్టుగా చెప్పుకున్న ఆంధ్రజ్యోతి తీరు కారణంగా చిన్న పత్రికలకు చిక్కులు తప్పవనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇలాంటి చేష్టలు తగవని కొందరు చెబుతున్నారు. అదే క్రమంలో హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తమ ప్రయత్నాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందనించారని ఆంధ్రజ్యోతి పేర్కొన్నది. కానీ వాస్తవానికి అంజన్ కుమార్ ట్విట్టర్ హ్యాండిల్ పై మాత్రం దానికి సంబంధించిన పోస్ట కనిపించలేదు. సీపీ ఎక్కడ అభినందించారన్నది కూడా స్పష్టత లేకుండా రాసిన కథనం విస్మయకర విషయంగా మారుతోంది. ఏమైనా ఇలా మహహ్మారి ముంచుకొస్తున్న వేళ కూడా సదరు పత్రిక తీరులో మార్పు రాలేదనడానికి ఇవన్నీ సంకేతాలుగా కొందరు భావిస్తున్నారు.