iDreamPost
iDreamPost
నేతి బీరకాయలో నెయ్యి ఆంధ్రజ్యోతిలో నిష్పక్షపాత వార్త ఆశించటం అత్యాశే . గత కొంతకాలంగా ఆంధ్రజ్యోతి వక్రీకరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి . అందుకు ఉదాహరణ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం తీసుకొంటున్న అసైన్డ్ ల్యాండ్ భూమి పై రాసిన ఈ వక్రీకరణ వార్త .
నెల్లూరులో జనార్దన్ రెడ్డి నగర్ పక్కనున్న 150 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ని పేద ప్రజల ఇళ్ల స్థలాలకు తీసుకొంటున్నారని అందులో పైరు కన్నీరు పెడుతుందని 50 అడుగుల లోతులో నీరు ఉన్న సారవంతమైన భూమి అని హెడ్ లైన్స్ తో మొదటి పేజీలో సాగిన కథనం పదవ పేజీలోకి వెళ్ళేసరికి షుమారు ముప్పై నుండి నలభై ఎకరాలు భూమి సాగవుతుందని మిగతాది బీడు భూమి , ఖాళీ జాగాలుగా ఉందని ముగిసింది .
ఈ భూమికి పరిహారం వస్తుందో లేదో , వస్తే ఎంత వస్తుందో తెలియదుని అధికారులు అంటున్నారని , వచ్చినా అప్పటి లబ్ధిదారుల వారసులకు పరిహారం వస్తుంది తప్ప ఇప్పటి కొనుగోలుదారులకు కాదని తేల్చి చెప్పారని రాసుకొచ్చింది . భూమిలో ఇల్లు కట్టుకొంటే కోర్టు కాపాడుతుందని కొందరు ఇప్పటికిప్పుడు హడావుడిగా ఇల్లు కడుతున్నారని వెల్లడించింది .
ఆంధ్రజ్యోతి వెలువరించిన ఈ కథనం పై ఇళ్ల స్థలాల లబ్ధిదారులు మండిపడుతుండగా , పట్టణ ప్రజలు , సీనియర్ రాజకీయవేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తారు .
మొత్తం 150 ఎకరాల భూమిలో షుమారు 30 నుండి 40ఎకరాలు సాగు చేస్తున్నారనే అర్ధ వార్త ఏ పత్రికైనా ఎలా ప్రచురిస్తుంది . ఓ చిన్న ప్రాంతంలో నికరంగా ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో ఇదిమిద్దంగా తేల్చిచెప్పలేని వారికి అసంబద్ధ వార్తలు రాసే అర్హత ఎందుకుంటుందని ఓ సీనియర్ సిటిజన్ వ్యాఖ్యానించారు .
పంట భూమి కోల్పోతే ఏ రైతుకైనా బాధకరమే కానీ 30 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఇళ్ల స్థలాల కోసం తగు పరిహారం ఇచ్చి తీసుకొంటుంటే పైరు కన్నీరు అని మెయిన్ పేజీలో హెడ్డింగ్ పెట్టిన ఆంధ్రజ్యోతికి అమరావతిలో 33000 ఎకరాలు ఏ పరిహారం ఇవ్వకుండా పూలింగ్ పేరిట రైతుల్ని వంచించి బంగారం పండే భూములు లాక్కుని బినామీ సామ్రాజ్యం సృష్టించుకొంటే ఏ రోజూ ఒక్క చిన్న వార్త కూడా ఈ ఆంధ్రజోతి రాయలేదేందుకని ప్రభుత్వాలని బట్టి , వ్యక్తుల్ని బట్టి పండే పంటలు , భూములు కోల్పోయిన రైతుల విలువలు మారతాయా అని అమరావతి ప్రాంతానికి చెందిన ఓ రైతు ప్రశ్నించారు .
వందల ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టి దోచుకోవటానికి రైతుల పొట్ట గొడితే ఒక్క అక్షరం రాయని పత్రిక ఈ రోజు బీదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వృధాగా ఉన్న అసైన్డ్ లాండ్ పరిహారం ఇచ్చి తీసుకొంటే పైరు కన్నీరు అంటూ పుంఖానుపుంఖాలుగా రాస్తుంది ప్రభుత్వం మీద నెపం వేయటానికే తప్ప రైతుల పై ప్రేమతో కాదని ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు .
ప్రభుత్వం అసైన్డ్ భూములకు సైతం పరిహారం ఇచ్చే ఇళ్ల స్థలాలకు భూమి తీసుకొంటుందని , ఇందుకోసం ఆల్రెడీ 1300 కోట్లు విడుదల చేసి , మరో 1990 కోట్లను శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన భూమి సేకరిస్తుంటే పరిహారం వస్తుందో లేదో వస్తే ఎంత వస్తుందో తెలియదని తాము వ్యాఖ్యానించలేదని , అవసరమైతే రైతులకు ఓ రూపాయి అదనంగా చెల్లించండి కానీ రైతుల్ని బాధ పెట్టొద్దని స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి .
ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా వార్త వచ్చిందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిహారం వస్తుందో రాదో తెలియదని తాము ఏ రైతుతోనూ , విలేఖరితోనూ అనలేదని అలాంటి వార్త వారి దృష్టికి వస్తే ప్రచురించే ముందు తమను సంప్రదించి తగు వివరణ తీసుకొని దాన్ని కూడా ప్రచురించడం పత్రికా ధర్మమని అలా కాకుండా ఏకపక్షంగా మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ తప్పుడు కధనాలు రాయడం ఆంధ్రజ్యోతికే చెల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు .