iDreamPost
iDreamPost
108 అంబులెన్స్ తరహాలో ఇప్పుడు మూగజీవాలకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘అంబా.. అన్న సైరన్‌తో పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) రథాలు వైద్య సేవలతో పాటు అవసరమైతే సర్జరీలు చేయడమే కాదు.. కోలుకునే వరకు వాటి ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. మైదాన ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, గిరిజన ప్రాంతాల్లో ఒకటి, అర్బన్‌లో కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబవుతున్న ఈ వాహనాలు త్వరలో సేవలందించబోతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండే వందలాది మూగజీవాలకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సకాలంలో వైద్యసేవలు అందడంలేదు. ఈ నేపథ్యంలో.. వైద్యసేవలందక ఏ ఒక్క మూగజీవి చనిపోకూడదన్న సంకల్పంతో 108, 104 తరహాలోనే దేశంలోనే మరెక్కడా లేని విధంగా జిల్లాకొకటి చొప్పున ‘సంచార పశు వైద్యశాల’లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి విడత 175 అంబులెన్స్‌లు
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాల కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా 340 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తొలి విడతగా ఈ నెలలో 175 అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఒక్కో అంబులెన్స్ తయారీకి రూ.37లక్షల చొప్పున మొత్తం రూ.125.80 కోట్లు ఖర్చుచేయనుంది. ఇక దీనిని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలోనూ అమలుచేయాలన్న ఆలోచనతో లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున అంబులెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
అంబులెన్స్ ప్రత్యేకతలు
ఇందులో డ్రైవర్ కమ్ అటెండర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఓ వైద్యుడు ఉంటారు. జీతభత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18.72లక్షల చొప్పున రూ.63.65 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రతీ అంబులెన్స్‌లో ప్రత్యేకంగా ట్రావిస్‌తోపాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన పూర్తిస్థాయి ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. కనీసం వెయ్యి కిలోల బరువున్న మూగజీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్‌లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. పెద్ద జంతువులకు ప్రాథమిక వైద్యంతో పాటు చిన్నపాటి ఆపరేషన్లు చేస్తారు. పెద్ద సర్జరీలు అవసరమైతే మాత్రం సమీప ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఆ గ్రామానికి తీసుకెళ్లి రైతుకు అప్పగిస్తారు. వీటి కోసం 24 గంటలూ పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్ 1962ను ఏర్పాటు చేస్తున్నారు. 108లోని కుయ్ కుయ్ తరహాలో వీటికోసం ‘అంబా..’ అన్న పశువుల అరుపుతో పాటు వాటి మెడలో కట్టే మెడపట్టెడ (గంటలు, మువ్వలు) శబ్ధంతో కూడిన వినూత్న సైరన్ రూపొందించారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా..
సీఎం వైఎస్ జగన్ ఆలోచనకు అనుగుణంగానే దేశంలోనే తొలిసారిగా వెటర్నరీ అంబులెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాన్ని మెచ్చుకున్న కేంద్రం జాతీయ స్థాయిలో అమలుకూ ముందుకొచ్చింది. మూగజీవాల పరిరక్షణే ధ్యేయంగా వైద్యసేవలందక ఏ మూగజీవి చనిపోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం.
Also Read : సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం.. జగన్ కీలక ఆదేశాలు