iDreamPost
iDreamPost
ప్రకృతి ప్రేమికులకు… పర్యావరణ హితులకు ఇది నిజంగా శుభవార్త. దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు I 2021 విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏకంగా 24.62 శాతం అటవీ ప్రాంతం పెరిగింది. కాని చిత్రంగా దేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణంగా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గుతుండగా … దక్షిణాది రాష్ట్రాలలో పెరుగుతుండడం విశేషం. జగనన్న పచ్చతోరణం వంటి కార్యక్రమాలతోపాటు అటవీ విస్తీర్ణం పెరిగేందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అటవీ విస్తీర్ణం పెరగడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
అటవీ ప్రాంత విస్తీర్ణం పెరుగుదలలో ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడి పోవడం విశేషం. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో కొండ, అటవీ ప్రాంతాలు అధికంగా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ (257), మణిపూర్ (249), నాగాలాండ్ (235), మిజోరామ్ (186), మేఘాలయా (73)ల్లో చ.కిమీల చొప్పున అటవీ విస్తీర్ణం తగ్గింది. అయితే ఈ రాష్ట్రాలు అటవీ విస్తీర్ణంలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 79.63 శాతం, మణిపూర్‌లో 75.46 శాతం, నాగాలాండ్ 75.31 శాతం, మిజోరామ్ 85.41 శాతం, మేఘాలయా 76.33 శాతం మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.
ఇదే సమయంలో కోస్తాలోని ఏపీ, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాల్లో విస్తీర్ణం భారీగా పెరగడం విశేషం. ఏపీలో 647 చ.కిమీల విస్తీర్ణంలో కొత్తగా ఆటవీ ప్రాంతం పెరిగి దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణాలో 632 చ.కిమీలతో రెండవస్థానంలో నిలిచింది. ఒడిస్సా 537, కర్ణాటక 155, జార్ఖండ్ 110 చ.కిమీల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి. ఉత్తరాదిన పంజాబ్‌లో తగ్గగా, దక్షిణాదిలోని కేరళలో సైతం అటవీ విస్తీర్ణం పెరిగింది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు I 2021 విడుదల చేసిన తాజా నివేదికలో దేశ వ్యాప్తంగా 2 వేల 261 చ.కిమీల విస్తీర్ణంలో అడవులు పెరగడం విశేషం. గతంలో పోల్చుకుంటే 24.62 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని నివేదికలో పేర్కొంది. 2017 నుంచి లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఏకంగా 5 వేల 188 చ.కిమీల విస్తీర్ణం అటవీ ప్రాంతం పెరిగిందని తేల్చింది.
ఏపీ అగ్రస్థానంలో నిలవడానికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం. జగనన్న పచ్చతోరణంలో భాగంగా రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే అటవీ విస్తీర్ణం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుంది. గతంలో నీరు-చెట్టు పేరుతో గత తెలుగుదేశం పార్టీ మొక్కలు నాటడం కన్నా ప్రచారానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది. కాని జగన్ ప్రభుత్వ హయాంలో విస్తారంగా చెట్లు పెంచడం వల్ల దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
Also Read : గోదావరి డెల్టా ఆశలన్నీ… బలిమెల పైనే