iDreamPost
android-app
ios-app

ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌ల‌కు “రికార్డు” ల‌తో స‌మాధానం

ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌ల‌కు “రికార్డు” ల‌తో స‌మాధానం

ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం, ప్ర‌తిప‌క్షం అన్నాక ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం మామూలే. అయితే విమ‌ర్శ‌లు కూడా అర్థ‌వంతంగా ఉండాలి. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండాలి. అప్పుడే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారు. ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతుంది. కానీ ఏపీలోని ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ.. అధికార పార్టీ ఏం చేసినా ఆరోప‌ణ‌లు చేయ‌డానికే ప‌రిమితం అవుతుంది కానీ, వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. అందుకు స‌రికొత్త ఉదాహ‌ర‌ణే వ్యాక్సినేష‌న్ పై ఆరోప‌ణ‌లు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలోనే వ్యాక్సినేష‌న్ ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జ‌లకు టీకా అందించ‌డానికి ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు త‌ర‌చూ ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై రాజ‌కీయాలు చేయ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఫ‌లితంగా అత్య‌ధిక మందికి టీకా అందించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది.

క‌రోనా కాలం మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ప‌రీక్ష‌లు చేయ‌డంలో కానీ, చికిత్స‌ను అందించ‌డంలో కానీ ఏపీ దేశంలోనే పేరుగాంచింది. ఆ విష‌యంలో ప్ర‌ధాని కూడా ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్ ను అభినందించారు. దూరపు కొండ‌లు నునుపు అన్న చందంగా రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షానికి మాత్రం అవేమీ క‌నిపించ‌లేదు. ప‌రీక్ష‌లు చేయ‌డం లేదంటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఇప్పుడు వ్యాక్సినేష‌న్ పై కూడా అదే పంథా అవ‌లంబిస్తోంది. కానీ లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే దేశంలో రికార్డు స్థాయిలో టీకాలు వేసిన రాష్ట్రంగా ఏపీ ముందంజ‌లో ఉంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ యావరేజ్ ను ఏపీ అలవోకగా దాటేయటమే కాదు.. తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి.. రెండో డోస్ తీసుకున్న వారు కోటి దాటేశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే 1,00,17,712 మందికి వ్యాక్సిన్ అందించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారు 74.92 లక్షలు కాగా.. సెకండ్ డోస్ తీసుకున్న వారు 25.24 లక్షలు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించానికి వ్యాక్సినేషన్ కు మించిన మార్గం మరొకటి లేదన్న విషయాన్ని గ్రహించిన ఏపీ సర్కారు టీకా కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో కోవీషీల్డ్.. కోవాగ్జిన్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి ఎప్పటికప్పుడు వచ్చేలా ప్లాన్ చేయటమే కాదు.. వచ్చిన వ్యాక్సిన్ వచ్చినట్లుగా ప్రజలకు అందించే విషయంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయటంతో తాజా రికార్డు సొంతమైందని ప్రభుత్వం చెబుతోంది. మ‌రి దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ ఏమంటుందో, ఇప్ప‌టికైనా త‌న దారి మార్చుకుంటుందేమో చూడాలి.

Also Read : క‌రోనాకు భ‌య‌ప‌డ‌ర‌ట‌.. ఎన్నిక‌లు ఆపేది లేద‌ట‌..!