Idream media
Idream media
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు హీరోలు అవుతారో.. జీరోలు అవుతారో చెప్పలేం. ఒక్క మాట, ఒక్క పని.. సదరు నేతలను నిమిషాల్లో హీరోలను చేస్తుంది, జీరోలను కూడా చేస్తుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. తన విద్యార్హతను చెబుతూ బి.కాంలో ఫిజిక్స్ చదివానని ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ ఒక్క మాట ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తన వ్యాఖ్యలతో ఫేమస్ అవుతున్నారు. ఆ వ్యాఖ్యలు సోము వీర్రాజు పరపతిని తగ్గిస్తూ.. రాజకీయంగా ఆయనకు, బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి.
కొద్ది రోజులుగా సోము వీర్రాజు తాము అధికారంలోకి వస్తే.. ఏమి చేస్తామో, ఏమి చేయగలమో చెబుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ సందర్భాల్లో హామీలు ఇస్తున్నారు. ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ 70 రూపాయలకే ఇస్తామని అన్నారు. ఆ విషయం ప్రజల్లోకి పెద్దగా పోలేదనుకున్నారో ఏమో గానీ.. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ బహిరంగసభలో.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్ 70 రూపాయలకే ఇస్తామని, ఆదాయం బాగా ఉంటే 50 రూపాయలకే ఇస్తామని ప్రకటించి చర్చల్లోకి ఎక్కారు. సోము చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలోనేగాక, దేశవ్యాప్తంగా హల్‌చల్ చేశాయి. సోముపై ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు, సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేశారు. ఆయనకు వివిధ రకాల పేర్లు కూడా పెట్టి పిలిచారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా విమర్శలు, హేళనలు ఎదుర్కొన్న సోము వీర్రాజు ఇబ్బంది పడ్డారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోము వీర్రాజు ఇచ్చిన హామీలు మళ్లీ చర్చల్లో నిలుస్తున్నాయి. తాను (బీజేపీ) అధికారంలోకి వస్తే నాటు కోళ్లు, నాటు కోళ్ల గుడ్లు అందిస్తామని చెప్పారు. ఇటీవల పలు సందర్భాల్లో నాటు కోళ్ల ఫారాల వల్ల ఉపాధి కల్పిస్తామని సోము చెబుతున్నారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాటుకోడి గుడ్లు పిల్లలకు, గర్భిణిలకు, బాలింతలకు అందిస్తామని చెబుతూ వస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సైజు చాలా తక్కువగా ఉంటోందని, అందులో పెద్ద ఎత్తున స్కాం జరుగుతోందని సోము వీర్రాజు టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కమ్యూనిస్టులు ఐసీడీఎస్ విభాగం నుంచి నెలకు రెండు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుంటున్నారని బహిరంగంగా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. నిర్ణీత బరువు (45–50 గ్రాములు) గల కోడిగుడ్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తామని చెబుతున్నారు.
అంగన్ వాడీ కేంద్రాల్లో పెద్ద సైజు కోడి గుడ్డు ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం బాగానే ఉంది. అయితే గత చరిత్ర ఆయన్ను నీడలా వెంటాడుతోంది. ఏమి మాట్లాడినా బూమరాంగ్ అవుతున్నాయి. చీప్ లిక్కర్ పై వ్యాఖ్యలు తాలుకూ ప్రభావం ఇప్పటికీ సోము వీర్రాజుపై పడుతున్నాయి. చీప్ లిక్కర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నాటు కోళ్లు, కోడి గుడ్లపై ఇచ్చిన హామీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘సోము వీర్రాజు గారు, చీప్ లిక్కర్ 50 రూపాయలకు, నాటు కోడి 70 రూపాయలకు, నాటు కోడి గుడ్డు ఐదు రూపాయలకే ఇస్తామంటున్నారు. అదే చేత్తో.. ఓ గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఇస్తే.. పని పూర్తవుతుంది..’’ అంటూ సోము వ్యాఖ్యలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సోము వివిధ అంశాలపై వేర్వేరుగా మాట్లాడుతున్నా.. అవన్నీ ఇలా సింక్ అవుతుండడంతో ఆశించిన ఫలితం రాకపోగా.. నవ్వులపాలవుతున్నారు.
Also Read : సోషల్ మీడియా సెటైర్లు వేసినా.. సోము ఊహించని ఫలితం దక్కింది.