మహిళల ఖాతాలో 18,750/- జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు పేద ప్రజలకు వివిధ పథకాలతో సాయాన్ని అందింస్తున్న విషయం తెలిసిందే. కాగా పథకాల సాయం పొందడానికి అన్ని అర్హతలు ఉండి కూడా పొందని వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి ప్రభుత్వ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటుంది జగన్ సర్కారు. తాజాగా వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయాన్ని అర్హత కలిగిన వారికి అకౌంట్లలో జమ చేసింది జగన్ సర్కారు.
40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు ఏళ్లకు రూ.75,000 ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రారంభించిన వైఎస్ఆర్ చేయూత పథకం తొలి విడతలో భాగంగా 21 లక్షల మంది మహిళలకు రూ. 4 వేల కోట్లను జమ చేశారు. కాగా అర్హత ఉండి కూడా దరఖాస్తు చేయకుండా మిగిలిన మహిళలకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు 2,72,005 మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.510.01 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేసింది.
తాడేపల్లి పంచాయతీరాజ్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ గురువారం ప్రారంభించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.