Idream media
Idream media
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టు ఆంధ్రాలో ఎన్నికలు తెలంగాణ వైన్ షాపులకి బిజినెస్ పెంచింది. ఆంధ్రా -తెలంగాణ బార్డర్‌లో 558 దుకాణాలున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు అంటే దాదాపు 10 రోజులు ఆంధ్రాలో వైన్‌షాపులు బంద్ అని మంత్రి అనిల్ నోరు జారేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. అధికారికంగా ఉత్తర్వు లేనప్పటికీ మందు జాగ్రత్త మొదలైంది.
ఆంధ్రాలో ఎలాగూ మంచి బ్రాండ్స్ దొరకవ్ కాబట్టి ఆల్రెడీ తెలంగాణ షాపులకి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఆదాయం రూ.1000 కోట్లు దాటుతుందని తెలంగాణ ఎక్పైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. లిక్కర్ పంపిణీలో ఇబ్బంది ఎదురు కాకుండా స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక్క ఫోన్‌కాల్‌తో ఎన్ని వందల కేసుల మద్యం అయినా సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నారు.
తెలంగాణలో ఫుల్ బాటిల్ మీద ఆంధ్రా కంటే రూ.100 వరకు తక్కువ రేటు ఉంది. క్వార్టర్ పైన కనీసం పది నుంచి 20 రూపాయల తేడా ఉంది. అందువల్ల బార్డర్ ప్రజలు సరిహద్దు దాటి తాగేసిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఆంధ్రాలో 8 దాటితే షాపులుండవు. అవి కూడా మూసేస్తారని అంటున్నారు. దాంతో నాయకులు తెలివిగా స్టాక్‌ను తరలిస్తున్నారు. తెలంగాణలో ఎంత సరుకు కొన్నా ఇబ్బంది లేదు కాబట్టి వేలకొద్ది బాటిళ్లు నిలువ చేస్తున్నారు. అంతేకాకుండా ఓటర్లకి కూపన్లు ఇస్తున్నారు. అవి చూపిస్తే షాపులో మందు ఇస్తారు.
ఇదే పరిస్థితి కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా ఉంది. చిత్తూరు జిల్లా నాయకులు మందు తరలించే పనిలోనే ఉన్నారు. కుప్పం నాయకులకి ఉన్న సౌలభ్యం ఏమంటే కర్నాటక, తమిళనాడు రెండూ కూతవేటు దూరంలోనే ఉన్నాయి.
జగన్ మంచి ఉద్దేశంతో చేస్తున్న పనులని సొంత పార్టీ వాళ్లే నీరుగారుస్తున్నారు. మద్యం పంచకూడదని సీఎం అంటున్నాడు సరే, మరి పంచకపోతే తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 558 దుకాణాల్లో జాతర జరగడం ఎలా సాధ్యం?
ఇక డబ్బు పంపకం జరగకూడదంటున్నారు. డబ్బున్న వాళ్లకే అన్ని పార్టీలు టికెట్లు ఇస్తున్నప్పుడు పంచకుండా ఎలా ఉంటారు? పంచితే తీసుకోకుండా జనం ఎందుకుంటారు?