iDreamPost
android-app
ios-app

మొన్న సముద్రం.. నేడు కాలుష్యం.. విశాఖపై అదే విషం..

మొన్న సముద్రం.. నేడు కాలుష్యం.. విశాఖపై అదే విషం..

సాగర నగరం, ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధాని విశాఖపై టీడీపీ అనుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు అంటూ విశాఖ నగరంలో సదస్సులు నిర్వహించిన సమయంలో.. విశాఖ గొప్పతనం, అనుకూలతల గురించి టీడీపీ అనుకూల మీడియా ఆకాశానికి ఎత్తేసింది. దేశంలోనే నివాసయోగ్యమైన అత్యుత్తమ నగరాల్లో విశాఖ ఒకటి అంటూ ప్రశంసల జల్లు కురిపించాయి. కట్‌ చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, అందులో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఉండడంతో.. అప్పటి వరకు భూతల స్వర్గంగా తాము చెప్పిన విశాఖ నగరం.. ఎందుకూ పనికిరాని నగరంగా టీడీపీ అనుకూల మీడియాకు మారిపోయింది.

మూడు రాజధానులు వద్దు.. అమరావతినే కొనసాగించాలనే టీడీపీ డిమాండ్‌కు అనుకూలంగా.. ఎప్పటికప్పుడు విశాఖపై ఆ పార్టీ అనుకూల మీడియా కుట్రలు చేస్తోంది. విషం చిమ్మడం నిత్యకృత్యంగా మారిపోయింది. మొన్నటి వరకు పలుమార్లు.. సముద్రాన్ని ఆధారంగా చేసుకుని.. నగరంపై విషం చిమ్మే రాతలు రాశాయి. భవిష్యత్‌లో విశాఖ నగరం సముద్రంలో కలిసిపోతుందని, సునామీ మింగేస్తుందని.. రకరకాల విశ్లేషణలు చేశాయి. ఇప్పుడు కాలుష్యం విశాఖను కాటేస్తుందంటూ మరో కొత్త కథను టీడీపీ అనుకూల మీడియా అయిన ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసుకొచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ తన పరిశోధనలో ఈ విషయం చెప్పిందని తెలుపుతూ.. అదే స్వచ్ఛంద సంస్థ.. అమరావతిలో గాలి కాలుష్యం తక్కువగా ఉందని తెలిపిందంటూ.. ఈ కథనం రాయడం వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని చెప్పకనే చెప్పింది.

పీల్చేగాలి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి ప్రమాణాలు ఉండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసిందని, దాని ప్రకారం గ్రీన్‌పీస్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసిందని ఆంధ్రజ్యోతి తన రాతలను మొదలుపెట్టింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విజయవాడ, విశాఖలో గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పుకొచ్చింది. అమరావతిలో మాత్రం బాగుందని చెప్పుకొచ్చింది. అమరావతి నగరం ఇంకా టీడీపీ అనుకూల మీడియా రాతల్లోనే ఉంది కానీ భూ ప్రపంచంలో లేదు. ఇప్పటికీ అమరావతి అంటే.. విజయవాడనే. విశాఖపట్నం, విజయవాడ రెండు నగరాలు. ఏ విషయంలోనైనా పోల్చాలనుకుంటే.. ఈ రెండు నగరాలను పోల్చి చూపాలి. ఇలా కాకుండా విజయవాడను వదిలేసి.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఉన్న అమరావతిలోని వాయు కాలుష్యాన్ని, విశాఖ నగరంలోని వాయు కాలుష్యాన్ని పోల్చుతూ.. విశాఖ కంటే.. అమరావతిలో గాలి స్వచ్ఛత బాగుందని చెప్పడం బహుశా ఆంధ్రజ్యోతికే సాధ్యమైన జర్నలిజం కాబోలు.

పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ 2020లో 9వ స్థానంలో ఉంది. దేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో 17వ స్థానంలో ఉంది. అయినా అమరావతికి పోటీగా ఉన్న విశాఖ విషయంలో ఇవేమీ టీడీపీ అనుకూల మీడియాకు కనిపించవు.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈనాడు రాతల్లో విద్వేషం ఎందుకో