Idream media
Idream media
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక, దాని యజమాని వేమూరి రాథా కృష్ణ తమ కలాలకు పని చెబుతున్నారు. కలం బలంతో.. తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నట్లుగా వారి కథనాలను చూస్తే అర్థం అవుతోంది. అమరావతి భూ కుంభకోణంపై మాజీ ఏజీ దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ కుమార్తెలతు సహా 13 మందిపై ఎసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, విచారణపై స్టే విధిస్తూ. ఎఫ్ఐఆర్లోని వివరాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. ఆంధ్రజ్యోతి ఇన్సైడర్ట్రేడింగ్ జరగలేదనే కోణంలో పలు విధాలుగా కథనాలు రాస్తోంది.
ఇందులో భాగంగానే నిన్న ఆదివారం రాథాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పేందుకు దాదాపు ముప్పావుపేజీ వ్యాసం రాశారు. పైగా దీని పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా విమర్శించారు. తాజాగా ఈ రోజు ‘‘ ఇన్సైడర్ డ్రామా’’ శీర్షికన.. మంత్రివర్గం ఉపసంఘం తేల్చింది ఏమిటి..? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు.. అంటూ ఆంధ్రజ్యోతిలో బాన్యర్ కథనం రాసుకొచ్చారు.
మొత్తంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పడమే ఆంధ్రజ్యోతి లక్ష్యంగా కనిపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఆంధ్రజ్యోతి చెప్పిన మాట నిజమని నమ్ముదామనుకుంటే.. మరి సిట్, ఏసీబీ దర్యాప్తులను ఆపాలని టీడీపీ నేతలు ఎందుకు హైకోర్టులో పిటిషన్లు వేశారు..? హైకోర్టులో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు..? ఏ తప్పూ జరగకపోతే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు..? అనే ప్రశ్నలు.. ఆంధ్రజ్యోతి కథనం చూసిన వారిలో మెదులుతున్నాయి.
ఇన్సైడర్ ట్రేడింగ్ డ్రామా అయితే.. ఆంద్రజ్యోతి చెప్పినట్లు కొండను తవ్వి ఎలుకను కూడా మంత్రివర్గ ఉససంఘం పట్టుకోలేకపోయితే.. ఈ విషయమే సిట్ లేదా ఏసీబీ తేల్చేవి కదా..? సరే ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదు, కక్ష పూరితంగా చంద్రబాబుపై బురదజల్లేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు, ఆంధ్రజ్యోతి భావిస్తోంది కాబట్టి.. సీబీఐతో దర్యాప్తు చేస్తే అన్ని అనుమానాలు పటాపంచలవుతాయి కదా..? సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశించింది కాబట్టి.. దర్యాప్తులను అడ్డుకోకుండా ఉంటే చాలాయే.
ఓ పక్క అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్జరగలేదని చెబుతూనే, మరో పక్క విచారణలను అడ్డుకుంటుంటే ప్రజలు నమ్ముతారా..? లేదా..? అని కూడా చూడకుండా కంప్యూటర్ ముందు కూర్చుని అరగంటలో కథనం రాసేసి, అచ్చేయడం వల్ల తమ వారిని తామాయింపజేడం తప్పా సత్యాలను మార్చలేమనే విషయం రాధాకృష్ణకు తెలియందు కాదు. తాము పందంటే పంది.. నందంటే నంది.. అనే తీరు ప్రస్తుత సోషల్ మీడియా కాలంలోనూ జరుగుతుందని ఆంధ్రజ్యోతి ఆశిస్తున్నట్లుగా ఉంది. ప్రజల్లో బలపడిన అనుమానాలను కథనాల ద్వారా మార్చలేమన్న విషయం రాధాకృష్ణకు తెలియదనుకోవడానికి వీలు లేదు. అయినా తమ వంతు ప్రయత్నం చేయాలన్నట్లుగా ఆంధ్రజ్యోతి తీరు ఉంది. అయినా నేరం జరిగిందా..? లేదా..? అనేది తేల్చాల్సింది విచారణ సంస్థలు, కోర్టులు కానీ పత్రికలు కాదు.