పచ్చ మీడియాగా వైసిపి నేతలు పిలిచే ఓ వర్గం మీడియా మరో సారి అధికారపార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విషం చిమ్మింది. మళ్ళీ ఫోటోల రాజకీయానికి తెర తీసింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో వర్ధన్ కో – ఆపరేటివ్ బ్యాంకును ప్రారంభించి 50 శాతం సబ్సిడీతో ఋణాలంటూ ప్రజలనెత్తిన కుచ్చు టోపి పెట్టిన జాషువా అలియాస్ మహేష్ అరెస్ట్ నేపథ్యంలో ఈ విష ప్రచారానికి ఆంధ్రజ్యోతి తెర తీసింది. సంవత్సరకాలంగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మహేష్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎపుడో నమోదైన ఈ కేసును ఇపుడు వైసీపీకి ముడి పెట్టేయత్నం ఆంధ్రజ్యోతి కథనంలో కనిపించింది.
అసలేం జరిగింది..
మహేష్ అలియాస్ జాషువా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినవాడు. ఇతనిపై గతంలోనే పలు ఆర్థిక నేరాలకు సంబందించిన కేసులు ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన బాలన్న అనే వైసిపి ఎస్సి నాయకుడు కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనేందుకు తరుచు అమరావతి వెళ్ళేవాడు. అక్కడ జాషువాతో ఈయనకు పరిచయం ఏర్పడింది. తాడేపల్లిలో జాషువా ప్రారంభించిన వర్ధన్ బ్యాంకులో 50 శాతం సబ్సిడీతో ఋణాలిప్పిస్తానని బాలన్నను ఒప్పించిన జాషువా తన బ్యాంకులో 3 లక్షలు డిపాజిట్ చేయించి రుణం మంజురు చేయించాడు. దీనితో జాషువాను నమ్మిన బాలన్న వర్ధన్ బ్యాంకును ఆత్మకూరులో ప్రారంభించాలని కోరాడు. అప్పటికే బాలన్న నంద్యాల పార్లమెంట్ జిల్లా వైసిపి ఎస్సి సెల్ అధ్యక్షుడయ్యారు.
2020 సెప్టెంబర్ లో జాషువా ఆత్మకూరులో వర్ధన్ బ్యాంక్ శాఖను ప్రారంభించారు. అదే శాఖలో బాలన్న కుమార్తె హేమలతకు మేనేజర్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ బ్యాంకు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కూడా ఆహ్వానించారు. బ్యాంకు ప్రారంభోత్సవంలో ప్రయివేట్ బ్యాంకులపై తనకున్న అనుమానాలను కుడా ఎమ్మెల్యే వ్యక్తపరిచారు. ఆయన అనుమానించినట్లే ఆత్మకూరు వర్ధన్ బ్యాంక్ ను 7 నెలల్లోనే మూసివేశారు. అప్పటికే సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి డిపాజిట్ లు దండుకున్నారు.
కొందరు బాధితులు అప్పటి కర్నూలు ఎస్పీ ఫకీరప్ప కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల వెనుక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి చొరవ కూడా ఉంది. ఆనాటి నుంచి జాషువా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులు మూడు రోజుల కిందట జాషువా అలియాస్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని విచారిస్తున్న పోలీసులు ఈ అరెస్ట్ ను ధృవీకరించలేదు. ఈ వ్యవహారం రెండేళ్లుగా జరుగుతున్నా బాధితులకు అండగా నిలవని టీడీపీ, ఎన్నడూ ఒక వార్త రాయని పచ్చ మీడియా హఠాత్తుగా దీన్ని సీఎం జగన్ కు, వైసిపి ఎమ్మెల్యేలకు చుట్టే యత్నం మొదలెట్టింది.
ఫోటోలు పెట్టి.. వైసీపీకి ముడిపెట్టి.
వైసిపి నంద్యాల పార్లమెంట్ జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షుడు బాలన్న తోపాటు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకయ్య మాదిగ లతో జాషువా కలసి ఉన్న ఫోటోలను, బ్యాంకు ప్రారంభోత్సవానికి వెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫోటో, 108 అంబులెన్స్ ల కోసం జాషువా ముఖ్యమంత్రికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన సందర్భంలోని ఫోటోలను పెట్టి విష ప్రచారం వంటను పాఠకులకు వండివార్చారు. ప్రణాళికలో భాగంగానే సోమవారం వార్తా కథనం రాగానే టిడిపి నాయకులు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు సంభంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశారు.నేతలతో ఫొటోలు తీసుకున్న వారు నేరాలకు ప్పాలడితే.. ఆయా నేతలకు ఆ నేరాలతో సంబంధం ఉందంటే.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై వేల కోట్ల రూపాయల మేర పదుల సంఖ్యలో కుంభకోణాలు ఉండాలి. ఆయనతో ఫొటోలు తీసుకున్న బిల్లీరావు సహా పలువురు అనేక ఆర్థిక నేరాల్లోనూ, ప్రజలను మోసం చేసిన కేసుల్లోనూ వెలుగులోకి వచ్చారు.
వర్ధన్ బ్యాంకుతో తనకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి కథనం రాసిన నేపథ్యంలో,శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు. బ్యాంకుతో తనకు సంబంధంలేదని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కథనాలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహేష్‌ను పోలీసులు పట్టుకున్న వెంటనే బ్యాంకు బాధితులు తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని, వారికి న్యాయం చేసేలా పని చేయాలని ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానని శిల్పా తెలిపారు.
శిల్పా చక్రపాణి రెడ్డి.. సామాజిక సేవ, యువత ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. గ్రామాలకు మంచినీటిసరఫరా, మహిళలకు వడ్డీలేని రుణాలు, యువతకు ఉపాధి కోసం వాహనాలు మంజూరు చేయించం.. లాంటి కార్యక్రమాలతో ప్రజల అభిమానం చూరగొన్నారు. శిల్పా రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి మచ్చలేదు. కేవలం ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై, ఎమ్మెల్యే శిల్పాపై బురదజల్లాలనే లక్ష్యంతోనే ఆంధ్రజ్యోతి కథనం రాయడం, దాన్ని పట్టుకుని టీడీపీ నేతలు యాగీ చేయడం అంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ తరహా కథనాలు, వాదనలు ప్రజల్లో ప్రభావం చూపవన్న విషయం ప్రత్యేకంగా వారికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.