iDreamPost
android-app
ios-app

ఆందోళ‌న‌లో అనంత‌పురం తెలుగు త‌మ్ముళ్లు

ఆందోళ‌న‌లో అనంత‌పురం తెలుగు త‌మ్ముళ్లు

అస‌లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. బ‌లోపేతం చేసేందుకు అధినేత చంద్ర‌బాబు ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. పైగా పేరున్న నేత‌లంద‌రూ ఒక్కొక్క‌రూ పార్టీని వీడుతున్నారు. దీనికితోడు క‌రోనా కార‌ణంగా ప్ర‌త్య‌క్ష్య కార్య‌క్ర‌మాలు లేక‌పోవ‌డంతో కేడ‌ర్ క‌నిపించ‌డం లేదు. వారిలో ఉత్సాహం స‌న్న‌గిల్లుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై నేడు నిర‌స‌న‌ల‌కు అధినేత పిలుపునిచ్చారు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. అనంత‌పురం జిల్లాలో కూడా ఆందోళ‌న‌ల‌కు సన్న‌ద్ద‌మ‌వుతున్న వేళ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరుతో తెలుగు త‌మ్ముళ్లు ఆందోళ‌న చెందుతున్నారు. నేత‌లు ఇలా ఉంటే.. కార్య‌క‌ర్త‌లు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని అంటున్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా సార్లు ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లోనే ఘర్షణలకు దిగారు. అక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిస్థితి ఇలానే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతున్నాయి.

వాస్త‌వానికి గత ఎన్నికలకు ముందు వ‌ర‌కూ అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ నియోజకవర్గాల్లో ఇంటిపోరు తారస్థాయికి చేరింది. గ‌తంలో అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే దీక్షలను చేయాలని టీడీపీ నేత‌ల‌కు పార్టీ పిలుపునిచ్చింది. కానీ, చాలాచోట్ల నేతలు మాత్రం దీక్షల కార్యక్రమాన్ని తమ బలాన్ని ప్రదర్శించేందుకు, అసమ్మతి గొంతు వినిపించేందుకే వాడుకుంటున్నారు. తాజాగా మ‌రోసారి అదే రిపీట్ అయింది.

మాజీ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర నాయుడు మధ్య వివాదం ముదిరి ముదిరి పాకాన ప‌డుతుందే త‌ప్పా ఆగ‌డం లేదు. గత ఎన్నికల నుంచి ఇరువర్గాల మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తన ఓటమికి హనుమంతరాయ చౌదరి కూడా కారణమని చెబుతూ పార్టీ అధిష్ఠానానికి ఉమామహేశ్వర నాయుడు ఫిర్యాదు చేసినా పార్టీ పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉమా వర్గీయులు. బలమైన జిల్లాలో ఈ విభేదాలు పార్టీ కొంప ముంచే అవకాశాలున్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో మొదలైన గొడవలు రానురాను మిగిలిన నియోజకవర్గాలకు కూడా పాకే అవకాశముంది. ఇప్పటి నుంచే పార్టీని పటిష్టపరిచేలా నాయకత్వం చొరవ చూపకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు పార్టీ కార్యకర్తలు, నేతలు.