iDreamPost
android-app
ios-app

మీతోనే ప్రాబ్లెమ్,వెళ్లిపోండని చెబుతున్న నేతలు

మీతోనే ప్రాబ్లెమ్,వెళ్లిపోండని చెబుతున్న నేతలు

తెలుగుదేశానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ అవ‌స‌రం చాలా ఉంది.. అని స్టేట్ మెంట్ ఇచ్చినందుకు ఆ పార్టీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఎపిసోడ్ ఎందాక వెళ్లిందో అంద‌రికీ తెలిసిందే. పార్టీని వీడాల్సి వ‌చ్చే వ‌ర‌కూ ఆ తతంగం సాగింది. ఇప్పుడు అనంత నేత‌ల వంతు వ‌చ్చిందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాము అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడే అతికొద్ది మంది నేతల్లో జేసీ బ్రదర్స్ తీరు భిన్నంగా ఉంటుంది. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జేసీ దివాకర్ రెడ్డి గడిచిన కొద్దిరోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో ఒక విషయంపై మాట్లాడి వార్త‌ల‌కెక్కుతున్నారు. ఇప్పుడు అదే విధంగా సొంత పార్టీలోని ప‌రిస్థితుల‌పై విమ‌ర్శ‌లు చేసి చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

ఇటీవ‌ల తాడిప‌త్రిలో జ‌రిగిన ఓ స‌మావేశంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానానికి బాగా కోపం తెచ్చిన‌ట్లుగా కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. పైగా జిల్లాలో పార్టీ ప‌రంగా జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌వ‌ర్ త‌గ్గించేలా పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ప్ర‌క‌టించిన పార్టీ అనంతపురం పార్లమెంటు కమిటీలో ఆ వ‌ర్గానికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో పాటు ‘రాయలసీమ ప్రాజెక్టులపై సీమ నేతల సదస్సు’లో పురుడుపోసుకున్న విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీల‌తో సంబంధం లేకుండా.. అనంత‌ర‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్ కు సొంత ఇమేజ్ ఉంది. దీంతో వారు అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చెబుతుంటారు. అలాగే తాజాగా.. కార్యకర్తల సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి పార్టీపై వ్యాఖ్య‌లు చేశారు. అది అనంత‌పురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అనంత టీడీపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితమే వేసిన పార్లమెంట్‌ కమిటీని రద్దు చేసి తాజాగా ఆఘమేఘాలపై కొత్త కమిటీని నియమించింది. ఇందులో జేసీ వర్గానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షునిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్‌ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా 40 మందితో కమిటీని ప్రకటించింది. ఇందులో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారు కూడా ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నవారే. జేసీ వర్గంతో సంబంధం లేని నేత‌లు.

Also Read : కాల్వ శ్రీనివాసులును కొట్టబోయిన తెలుగు తమ్ముడు

పార్ల‌మెంట‌రీ క‌మిటీలో జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ర్గానికి ప్రాధాన్యం లేకుండా చేయ‌డం ద్వారా వారిపై అధిష్ఠానం గుర్రుగా ఉంద‌నే విష‌యాన్ని తెలియ‌జేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జేసీ బ్ర‌ద‌ర్స్ పార్టీని వీడునున్నార‌ని చాలా సంద‌ర్భాల్లో ప్ర‌చారం జ‌రిగింది. దీనికి తోడు ఇప్పుడు పార్టీయే వారికి ప్రాధాన్యం లేకుండా చేయ‌డం ద్వారా పొమ్మ‌న‌కుండా పొగ‌బెడుతుంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే.. జగన్ ప్ర‌వాహంలో ప్ర‌త్య‌ర్థులు అంద‌రూ కొట్టుకుపోయినా, త‌ట్టుకుని నిల‌బ‌డి తాడిప‌త్రిని సొంతం చేసుకున్న జేసీ వ‌ర్గాన్ని పార్టీ అంత ఈజీగా వ‌దులుకుంటుందా అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో మున్ముందు చూడాలి.