Idream media
Idream media
అనంతపురం ఓవర్ బ్రిడ్జి కనుమరుగైంది. రోడ్డు విస్తరణ కోసం కూల్చేశారు. ఆ బ్రిడ్జి నాలాంటి వాళ్లకి 50 ఏళ్ల జ్ఞాపకం. అనంతపురంలో జీవించిన లక్షలాది మందికి జీవితకాలపు ల్యాండ్ మార్క్. మనుషులకే కాదు కట్టడాలకి కూడా జీవన మరణాలుంటాయి.
ప్రపంచమంతా ఒక అద్భుతంగా, కలల ప్రపంచంగా కనిపిస్తున్న బాల్య దశలో బస్సు కిటికీలోంచి ఈ బ్రిడ్జి పైనుంచి అనంతపురాన్ని చూడడంతో నేను రెక్కల గుర్రంపై రాకుమారున్ని. 1969లో కిలోమీటర్లు మేర ద్రాక్షతోటలు. గుత్తులుగా వేలాడుతున్న ద్రాక్ష పంట స్వాగతం చెబుతుండగా అనంతపురం వచ్చేది. ఓవర్‌బ్రిడ్జితోనే ఊరు ప్రారంభం. రాయదుర్గంతో పోలిస్తే ఇది చాలా పెద్దది. బ్రిడ్జి దిగగానే నిలువెత్తు టవర్ క్లాక్ దర్శనం.
చుట్టపుచూపుగా పలకరించే బ్రిడ్జి , 1976 నుంచి ఆప్తమిత్రుడుగా మారింది. జూనియర్ కాలేజి వెళ్లాలంటే టవర్ క్లాక్ మీదుగా వెళ్లాలి. దూరం నుంచి బ్రిడ్జి పలకరించేది. సైకిల్ కొన్న కొత్తలో ఆయాసంతో బ్రిడ్జిపైకి తొక్కి, అక్కడ నుంచి చేతులు వదిలేసి , సాహసవీరుడిలా కిందికి దిగడం . సాహసులకే దెబ్బలు. సైకిల్‌తో పాటు బ్రిడ్జిపైన పల్టీలు కూడా సాధారణమే. బ్రిడ్జి కింద రైల్వేట్రాక్ దాటి ట్యూషన్ కెళ్లేవాన్ని. రైలు వస్తున్నా లెక్క చేయకుండా సైకిల్‌ని భుజాన పెట్టుకుని ట్రాక్ దాటడం యవ్వన మూర్ఖత్వం.
బ్రిడ్జి కింద పాత పుస్తకాల షాప్ వుండేది. కొంటే హాఫ్‌రేట్, అమ్మితే 25 శాతం. బాట్లిబాయ్ అకౌంట్స్ బుక్‌ని పది రూపాయలకి అమ్మేసి సినిమా చూసి నా పుస్తకాన్నే మళ్లీ 20 రూపాయలకి కొనడం చూసి బ్రిడ్జి నవ్వుకునేది.
కూరగాయలు కావాలంటే బ్రిడ్జి కిందకి రావాల్సిందే. ఆర్ట్స్ కాలేజి హాస్టల్ నుంచి రైల్వేట్రాక్ వరకూ ఇరువైపుల కూరగాయల దుకాణాలు, తరువాత ఇవి టవర్ క్లాక్ దగ్గరికి షిప్ట్ అయ్యాయి.
స్టేడియంలో జరిగే ఆటల్ని బ్రిడ్జిపై నుంచి చూడడం సరదా. రైల్వేట్రాక్‌పై పడిన శవాల్ని చూడడం ఒక భయం. ట్రాక్ దాటగానే జైభారత్ కాఫీ పొడి వాసన పలకరిస్తుంది (ఇప్పుడు కూడా). మిరప కాయ బజ్జీలు బ్రిడ్జి కింద చాలా ఫేమస్. నిన్నమొన్న కూడా తిన్నాం. ఆ ప్లేస్‌లో ఇపుడు శిథిలాలు.
2003లో అనంతపురంలో నేను జర్నలిస్ట్. ఒక ముసలమ్మ తన కొడుకుని వీల్ చెయిర్‌లో ప్రతిరోజూ బ్రిడ్జిపై నుంచి ఆయాసంతో జూనియర్ కాలేజి వరకూ వస్తుందని ఫోటోగ్రాఫర్ నరసింహులు చెప్పాడు. కాళ్లులేని కొడుకు చదువు కోసం ఆమె తపన, బాధ. జూనియర్ కాలేజి గ్రౌండ్‌లో ఇంటర్వ్యూ చేశాను. వీల్ చెయిర్ కండీషన్‌లో లేకపోవడంతో బ్రిడ్జి దిగుతున్నప్పుడు తనకి శక్తి చాలడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
అప్పటి ఫీచర్స్ ఎడిటర్ వసంతలక్ష్మి స్పందించి “ఈ తల్లికి ఇవ్వరా చదువుల అవార్డు” అని నవ్యలో ఫుల్ పేజీ పబ్లిష్ చేశారు. తెల్లారేసరికి ఆ ముసలమ్మ జీవితం మారిపోయింది. ప్రభుత్వం నుంచి లక్ష సాయం, స్వచ్ఛంద సంస్థల చేయూత, కొత్త వీల్ చెయిర్ అన్నీ వచ్చాయి. ఈ రోజు కుర్రాడికి మంచి ఉద్యోగం, ఆ తల్లికి భద్ర జీవితం వచ్చాయంటే ఆ బ్రిడ్జే కారణం.
దీవార్ సినిమాలో మేరేపాస్ మా హై డైలాగ్‌లా, జర్నలిస్ట్‌గా నువ్వేం సాధించావంటే నా రాతల వల్ల కొందరి జీవితాలు మారాయి అని చెబుతాను. నాది కాదు, జర్నలిజం పవర్ ఇది.
కళ్ల ముందు బ్రిడ్జి మాయమయ్యేసరికి చిన్నప్పట్నుంచి చూస్తున్న ఒక మిత్రుడు అంతర్థానమైన ఫీలింగ్. ఇపుడు కనిపిస్తున్న దుమ్ము,ధూళి, శిథిలాల కింద జ్ఞాపకాలు, జీవితాలున్నాయి.
చెట్టు కూలినపుడు పక్షులు దిక్కులేనివైనట్టు, బ్రిడ్జికి అటుఇటు బతికే చిన్న ప్రాణాలు చెల్లాచెదురై పోయాయి. ఒక నిర్మాణం వెనుక సిమెంట్ ఇసుకతో పాటు కన్నీళ్లు కూడా కలుస్తాయి. దీన్నే అభివృద్ధి అంటారు.