iDreamPost
android-app
ios-app

అనంతపురం మేయర్ పదవికి పోటా పోటీ

అనంతపురం  మేయర్ పదవికి పోటా పోటీ

టీడీపీ కంచుకోటలకు బీటలు వారుతున్నాయి. ఒకప్పుడు ఆ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోటగా ఉండేది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ జిల్లాలో టీడీపీకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చేవి. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత చరిత్రను తిరగ రాశారు. 14 సీట్లలో 12, 2 ఎంపీ స్థానాలను కొల్లగొట్టి టీడీపీని చావు దెబ్బ తీశారు. ఆ దెబ్బ నుంచి కొలుకోవడానికి టీడీపీ చేస్తున్న ఏ ఒక్క ప్రయత్నం సఫలీకృతం కావట్లేదు.

టీడీపీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లా టీడీపీకి అండగా నిలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ దెబ్బతో కొంత మంది నాయకులు అస్త్ర సన్యాసం చేయగా, మరికొందరు పార్టీనే మార్చేశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో యేటికి ఎదురీదాల్సిన దుస్థితి నెలకొంది.

అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు 6 డివిజన్లలో అభ్యర్థులే కరువయ్యారు. దీనితో మొత్తం 44 వార్డులకే ఆ పార్టీ పరిమితమైంది. ఇక బీజేపీ 15, సీపీఐ 3, సీపీఎం 4, జనసేన14, కాంగ్రెస్ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

అధికార వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. దీంతో మేయర్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఈ దఫా జనరల్ కి లభించడంతో అభ్యర్థుల మధ్య పోటీ విపరీతంగా ఉంది. ప్రధానంగా చవ్వా రాజశేఖర్ రెడ్డి, కోగటం విజయభాస్కర్ రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్,వైవి మణికంఠ రెడ్డి మధ్యే పోటీ నెలకొంది.

అయితే చవ్వా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని విధేయుడిగా వున్నారు. ఈయనకు డైరెక్ట్ గా సీఎం జగన్ తో సంబంధాలున్నాయి. కోగటం విషయానికి వస్తే ఈయన జేసీ దివాకర్ రెడ్డి కి అనుచరుడిగా వున్నారు. అయితే ఆయన టీడీపీ కి వెళ్లడంతో వైసీపీ లోకి వచ్చారు. ఈయనకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయి.

ఇక శ్రీనివాస్ 2009 సాధారణ ఎన్నికల్లో మరియు 2012 ఉపఎన్నికలో లో టీడీపీ నుంచి అనంతపురం ఎమ్మెల్యే గా పోటీ చేసి గురునాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి గత ఎన్నికల వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 2014 లో, 2019లో టికెట్ ఆశించి భంగపడ్డారు. టీడీపీ మీద అసంతృప్తితో 2019 ఎన్నికల్లో వైసీపీ లో జాయిన్ అయ్యారు. ఈయన బలిజ సామాజిక వర్గం కావడం కొంచెం సానుకూలాంశం. అలాగే తొమ్మిది డివిజన్ల లో ముస్లింలు పోటీ చేస్తుండడంతో ఒక వేళ సామాజిక సమీకరణాల దృష్ట్యా మైనార్టీలకు ఇవ్వాల్సి వస్తే వైసీపీ సీనియర్ నేత నదీమ్ అహమ్మద్ సూచించిన వారికి ఇచ్చే అవకాశం ఉంది.

కాగా, టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. జేసీ పవన్ కుమార్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వీరిద్దరితో పాటు ప్రకాష్ నాయుడు తమ్ముడు పరిమి రాజారావు మూడో వర్గంగా వున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ముగ్గురు తీవ్రంగా కష్టపడుతుండడంతో ఆ పార్టీ అభ్యర్థుల వెన్నులో వణుకు మొదలైంది. నాయకుల గొడవలకు తాము ఎక్కడ బలవ్వాల్సి వస్తుందోనన్న భయాందోళనలో వున్నారు. నాయకుల కుమ్ములాట వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మేయర్ పీఠంపై వైసీపీ జెండా ఎగుర వేసేందుకు అధికార పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.