iDreamPost
android-app
ios-app

ఆనం పేల్చిన నెల్లూరు మాఫియా బాంబు!

  • Published Dec 07, 2019 | 5:25 AM Updated Updated Dec 07, 2019 | 5:25 AM
ఆనం పేల్చిన నెల్లూరు మాఫియా బాంబు!

నెల్లూరు నగరంలో అన్నిరకాల మాఫియాలు రాజ్యం ఏలుతున్నాయని ,ఇసుక,బెట్టింగ్,లిక్కర్ మాఫియాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.

మాఫియాను అరికట్టాలంటే ఆత్మస్థైర్యం ఉన్న అధికారులు కావాలని,కానీ అలాంటి అధికారులు వస్తే తాము అంటే రాజకీయ నాయకులం వారిని ఎక్కువ రోజులు ఉండనీయమని అన్నారు. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగిన ఆనం రామనారాయణ రెడ్డి గత ఐదు సంవత్సరంలో ముగ్గురు SP లను, కలెక్టర్లను మార్పించామని అన్నారు.

స్వచ్ఛమైన తేనె కావాలంటే వేంకటగిరి అడవులకు వెళ్లాలని ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాలి. అక్కడ కబ్జా రాయుళ్లు, లిక్కర్‌ మాఫియా, బెట్టింగ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా.. ఇలా ఒక్కటేమిటి ఏ రకం మాఫియా కావాలన్నా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆనం వ్యాఖ్యలలో నిజా నిజాలు ఎలా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే తీవ్ర వ్యాఖ్యలు చెయ్యటం నెల్లూరు జిల్లా వైసీపీలో కల కలం సృష్టిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ అయినా తనకు మంత్రి పదవి లేదా మరో ముఖ్య పదవి వస్తుందని ఆశించారు.జగన్ మాత్రం వైసీపీ పెట్టినప్పటి నుంచి తనతో ప్రయాణం చేసిన మేకపాటి గౌతమ్,అనిల్ యాదవ్ లకు మంత్రి పదవులు ఇచ్చారు.

నెల్లూరు జిల్లాలో అనిల్ యాదవ్,కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వర్గంగా వ్యవహరిస్తుండగా,మేకపాటి గౌతంతో ఉదయగిరి,గూడూరు,సూళ్లూరు పేట ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉన్నారు. సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ వర్గంలో లేకుండా అందరితో సఖ్యంగా ఉండి పనులు చేయించుకుంటున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి,ఆనం రామ్ రాయణ రెడ్డి ఒక వర్గంగా మెలుగుతున్నారు. 2 నెలల కిందట ఒక అధికారిణి ఫిర్యాదుతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడులయ్యారు. ఆ అధికారిణికి కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతు ఉందని ప్రచారం జరిగింది.

నెల్లూరు జిల్లాకే చెందిన విజయసాయి రెడ్డి ఆ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు కలుగచేసుకోలేదు.నెల్లూరు జిల్లాకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ అప్పగించిన పనులు చక్కదిద్దటానికే పరిమితం అయ్యాడు.

మొత్తంగా నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి రామ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బయటపడింది. ఆనం వ్యాఖ్యలు మంత్రి అనిల్,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మీదనే అని ప్రచారం జరుగుతుంది. నిన్న టీడీపీ కి రాజీనామా చేసిన బీసీ నేత బీదా మస్తాన్ రావ్ వైసీపీ లో చేరకముందే నెల్లూరు జిల్లా వైసీపీ వర్గ పోరు మరో రూపంలో బయటపడింది.ఇంత మంది సీనియర్ నాయకులను సమన్వయ పరచాలంటే జగన్ ఎక్కువ దృష్టి పెట్టాలి.