iDreamPost
android-app
ios-app

జగన్ ప్రభుత్వానికి ఊహించని అడ్డంకి

జగన్ ప్రభుత్వానికి ఊహించని అడ్డంకి

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణి పధకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇళ్ల పట్టాల పంపిణి ప్రక్రియను వాయిదా వెయ్యాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పధకం వ్యక్తిగత లబ్ది పరిధిలోకి వస్తున్నందున ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పధకం అమలు చేసేందుకు వీలుపడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పధకానికి అనుమతి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి లేఖ అందలేదని, అయితే రోజువారీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షలు జరుపుకోవచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

గతవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజున ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం పై కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ ఇళ్లపట్టాల పంపిణి ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటికంటే ముందే ప్రారంభమయింది కాబట్టి ఆ పధకానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పినప్పటికీ.. అనంతరం విపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ పధకానికి తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ తిరిగి శ్రీరామ నవమి కి ఈ పధకాన్ని ప్రారంభించి రాష్ట్రమంతా ఒకేసారి 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలనే కృతనిశ్చయంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని, అందుకు తగ్గట్టే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అధికారులు తెలియచేశారు.