Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని అంశంపై ప్రశాంతంగా చర్చ సాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి ఏకభిగిన సభ కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికార పార్టీ సభ్యులు చర్చలో మాట్లాడారు. ఆ తర్వాత శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచన మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్య నేతలు ఆ సమయంలో సభలో లేకపోవడంతో మొదటగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
టీడీపీకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ గుంటూరు పశ్చిమ, గన్నవరం ఎమ్మెల్యేలు మద్ధాలి గిరి, వల్లభనేని వంశీలు.. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష టీడీపీకి దూరంగా కూర్చుంటున్నారు. ప్రతిపక్షం కూర్చునే వరుసలోనే వెనుక భాగంలో ఆశీనులవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అమరావతిలో జరిగిందంటున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. వల్లభనేని వంశీ, మాద్దాలి గిరి వద్దకు వెళ్లారు. వారి పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు. వల్లభనేని వంశీకి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది.