Idream media
Idream media
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలను కూడా తమతో పాటు పనులకు తీసుకువెళ్లటం గమనించి వారి పిల్లలను పాఠశాలలకు పంపి చదివిస్తే ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి విదితమే. వైయస్సార్సీపి పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి “అమ్మ ఒడి” అనే పథకమును చదువుకునే విద్యార్థుల కోసం నూతనంగా ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో 81,72, 224 మంది విద్యార్థులు చదువుతున్నారు.
రాష్ట్రంలో చదువుకునే మొత్తం విద్యార్థులను ఆరు దశలలో పరిశీలించి 65,17,006 మంది అర్హులుగా 14,71,214 మంది అనర్హులుగా లెక్క తేల్చారు. విద్యార్థి అర్హత సాధించిన ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు తమ బ్యాంకు ఖాతాలు ఒకరికంటే ఎక్కువమందికి ఇవ్వడంతో 1,84,004 మంది విద్యార్థులను మినహాయించారు.14,71,214 మంది తల్లులను అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితా నుండి ప్రభుత్వ ఉద్యోగులు /పెన్షన్ దారులు,కరెంటు బిల్లు 300 యూనిట్స్ పైగా చెల్లింపుదారులు,10ఎకరాలు పైబడి భూమి కలిగి ఉన్న రైతులు,4చక్రాల వాహనం ఉండటం,ఆదాయపు పన్ను చెల్లింపు వంటి వివిధ కారణాలతో తొలగించారు.
జనవరి 9వ తేదీన సుమారు 41 లక్షల 47 వేల మంది తల్లుల బ్యాంకు ఖాతాలలో 15 వేల రూపాయల చొప్పున అమ్మ ఒడి పథకం కింద సుమారు రూ.6200 వేల కోట్లు జమ చేయనున్నారు.సోషల్ ఆడిట్ కి వెళ్ళిన 14.71 అనర్హుల జాబితాలో ఆడిట్ అనంతరం సుమారు లక్ష మంది పైగా పెరగవచ్చునని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.