iDreamPost
android-app
ios-app

పట్టు విడవని ఇరు పక్షాలు.. అమిత్‌షా చర్చలు విఫలం..

పట్టు విడవని ఇరు పక్షాలు.. అమిత్‌షా చర్చలు విఫలం..

వ్యవసాయ రంగంలో తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న రైతులు తమ పట్టు విడవడం లేదు. భారత్‌ బంద్‌ జరుగుతున్న సమయంలో పరిస్థితి చేయిదాటిపోతోందన్న భావనతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. నిన్న రాత్రి ఏడు గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించిన అమిత్‌ షా.. షెడ్యూల్‌ కన్నా రెండు గంటలు ఆలస్యంగా చర్చలు ప్రారంభమయ్యాయి, 13 మంది రైతుల ప్రతినిధులతో అమిత్‌ షా చర్చలు జరిపారు. చట్టాలు రద్దు చేయాలని రైతుల ప్రతినిధులు.. అది సాధ్యం కాదని అమిత్‌ షా ఎవరికి వారు తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో మరోమారు చర్చలు విఫలం అయ్యాయి.

చట్టాల రద్దు సాధ్యం కాదని చెప్పిన అమిత్‌ షా.. రైతులు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్న చట్టాలలోని 39 అంశాలపై సవరణలను తాము ప్రతిపాదిస్తామని చెప్పారు. ఆయా సవరణలను రైతులకు పంపుతామని, వాటిని పరిశీలించాలని సూచించారు. అమిత్‌ షా వినతిని అంగీకరించిన రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం ముగించుకుని వచ్చారు.

అమిత్‌ షా ప్రతిపాదనల నేపథ్యంలో.. ఈ రోజు బుధవారం కేంద్ర మంత్రులతో జరగాల్సిన ఆరోరౌండ్‌ టేబుల్‌ చర్చలను రైతు సంఘాల ప్రతినిధులు రద్దు చేసుకున్నారు. గత నెల 26వ తేదీ నుంచి ఆందోళన చేస్తున్న రైతులు.. తమ డిమాండ్‌పై ఇప్పటి వరకు ఐదు సార్లు కేంద్ర మంత్రులతో చర్చలకు వెళ్లారు. ఈ రోజు ఆరో సారి జరగాల్సి ఉండగా.. అభ్యంతరాలపై సవరణలు ప్రతిపాదిస్తామని అమిత్‌ షా చెప్పడంతో ఈ రోజు చర్చలు అవసరంలేదనే నిర్ణయానికి వచ్చారు.

కాగా, మరోవైపు రైతులకు మద్ధతు తెలిపిన రాజకీయ పార్టీలు ఈ రోజు రాష్ట్రపతితో భేటీ కానున్నారు. నిన్న జరిగిన బంద్‌కు కాంగ్రెస్‌ సహా 25 రాజకీయ పార్టీలు మద్ధతు తెలిపాయి. కొత్త చట్టాలపై రైతుల ఆందోళనకు గల కారణాలను రాష్ట్రపతికి వివరించాలని రాజకీయ పార్టీల నేతలు నిర్ణయించారు. రాష్ట్రపతితో సమావేశానికి ముందు రైతులకు మద్ధతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు సమావేశం కానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌తో భేటీ కానున్నారు. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఐదుగురు మాత్రమే భేటీ కానున్నారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్, సీపీఎం నేత సీతారం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, డీఎంకే నేత టిఆర్‌ బాలులు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.