iDreamPost
android-app
ios-app

అమీర్ చుట్టూ పోటీ సినిమాల వలయం

  • Published Jun 16, 2022 | 3:25 PM Updated Updated Jun 16, 2022 | 3:25 PM
అమీర్ చుట్టూ పోటీ సినిమాల వలయం

ఇంకో రెండు నెలల్లో ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చద్దాని చూసి సౌత్ మేకర్స్ భయపడటం లేదు. పైపెచ్చు దానికి పోటీగా తమ సినిమాలను వరసబెట్టి లైన్ లో పెడుతున్నారు. ఇది దక్షిణాది మార్కెట్ లో అమీర్ ఖాన్ ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసే అంశం. ముందుగా చెప్పుకోవాల్సిన కాంపిటీషన్ అక్షయ్ కుమార్ రక్షా బంధన్. ఇది ఇవాళే కన్ఫర్మ్ చేశారు. అదే రోజు రాబోతున్న విక్రమ్ కోబ్రా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. రకరకాల చిత్రవిచిత్రమైన గెటప్స్ లో చియాన్ ని చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన కోబ్రా వెనుకడుగు వేసే సూచనలు లేవు.

ఒక రోజు గ్యాప్ తో 12న పెద్ద జాతరే ఉంది. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మీద చెప్పుకోదగ్గ హైప్ కనిపిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో పాటు హీరోయిన్ కృతి శెట్టి ఆకర్షణగా నిలుస్తోంది. సమంతా ప్రధాన పాత్రలో రూపొందిన ‘యశోద’ను ఇదే డేట్ కి దించబోతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ పూర్తిగా సామ్ బ్రాండ్ మీదే బిజినెస్ జరుపుకుంటోంది. విశాల్ ‘లాఠీ’తో వస్తున్నాడు. దీన్ని కొద్దిరోజుల క్రితం కన్ఫర్మ్ చేశారు. 13న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు హీరోగా లాంచ్ అవుతున్న ‘స్వాతిముత్యం’ వస్తోంది. సితార లాంటి పెద్ద బ్యానర్ కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజ్ ఉంటుంది.

ఇంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు కారణం ఒకటే. లాంగ్ వీకెండ్. ఆగస్ట్ 15ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు పోటాపోటీగా తలపడుతున్నారు. 11న రక్షాబంధన్, 12 శుక్రవారం, 13 సెకండ్ సాటర్ డే, 14 ఆదివారం, 15 స్వాతంత్ర దినోత్సవం. ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటే మొత్తం 5 రోజులు వరస సెలవులు. మాములుగా ఇలాంటి సీజన్ అరుదుగా వస్తుంది. అందుకే నువ్వానేనా అనే స్థాయిలో తలపడుతున్నారు. ఇంతకు ముందు ఏజెంట్ ని కూడా ఆగస్ట్ 12 ప్రకటించారు కానీ ఆ తర్వాత ప్రొడక్షన్ లో ఆలస్యం వల్ల నిర్ణయం మార్చుకున్నారు. ఒకరకంగా అది మంచిదే అయ్యింది.. మొత్తానికి అమీర్ చుట్టూ ఇంత పెద్ద వలయమే ఉంది.