iDreamPost
iDreamPost
లాక్ డౌన్ ప్రభావం సినిమా పరిశ్రమ మీద తీవ్రంగా ఉంటోంది. చాలా నిర్మాతలు థియేటర్లు తెరిచేదాకా ఆగాలా లేక ఓటిటికి అమ్మేయలా అనే సందిగ్ధంలో రోజూ నరకం చూస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే షూటింగ్ సగంలో అయిపోయిన వాళ్ళ గురించి చెప్పేదేముంది. తిరిగి మొదలుపెడదామా అంటే బయట కేసుల భయం. అమితాబ్ బచ్చన్ నుంచి రాజమౌళి దాకా ఈ మహమ్మారి ఎవరినీ వదలలేదు. అదృష్టవశాత్తు త్వరగా కోలుకోవడంతో గండం తప్పింది. అయితే బయట పరిస్థితి అలా లేదు. ఇంకా భయంభయంగానే రోడ్ల మీదకు వెళ్ళాల్సి వస్తోంది. అందుకే స్టార్లు ఇప్పటికిప్పుడు ఇంటి నుంచి కాలు బయట పెట్టే మూడ్ లో లేరు. ఇక ముందే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్న ప్రొడ్యూసర్లు ఇష్టం లేకపోయినా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారు.
ఇప్పటికే అవతార్ సిరీస్ ఏడాది పాటు పోస్ట్ పోన్ చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పుడు బాలీవుడ్ అదే రూట్ పట్టింది . అమీర్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఏకంగా 2021 డిసెంబర్ కు వాయిదా వేశారు. అంటే సంవత్సరం దాకా అమీర్ ఖాన్ సినిమా రాదు. ఇది నిజంగా షాకింగ్ కలిగించే నిర్ణయమే. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు అవుట్ డోర్లో విదేశాల్లో స్వేచ్చగా షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో ఇలా ఫిక్స్ అయినట్టుగా ముంబై టాక్. కరీనా కపూర్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కి ఇండియన్ వెర్షన్ రీమేక్. మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి దీన్ని రూపొందిస్తున్నారు. విజయ్ సేతుపతి ఇందులో క్యామియో చేస్తున్నారు.
సీక్రెట్ సూపర్ స్టార్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అద్వైత్ చందన్ ఈ లాల్ సింగ్ చద్దాకు దర్శకుడు. ఇప్పటికే సగం పైగా పూర్తైనా హడావిడి పడకుండా కూల్ గా చేసుకుందామనే అమీర్ ప్రతిపాదనతో ఏకీభవించి నిర్మాతలు ఈ డెసిషన్ తీసుకున్నారు. అమీర్ స్వంత బ్యానర్ భాగస్వామ్యంలోనే ఇది రూపొందుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ వాయిదా పడిన స్టార్ హీరో చిత్రం ఇదే. దీన్ని మరికొందరు అనుసరించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి సినిమా పరిశ్రమ థియేటర్ – ఓటిటి లాగా రెండుగా విడిపోయింది. కొందరు ఇటు వైపు మరికొందరు అటువైపు చేరిపోయారు. ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటున్నారు విశ్లేషకులు. మరి మన ఆర్ఆర్ఆర్ విషయంలో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాలి. వచ్చే నెల నుంచి అన్ని బాషల్లోనూ ఇలాంటి అనౌన్స్ మెంట్లు క్యు కట్టేలా ఉన్నాయి.