ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరణాలు నమోదవుతున్నాయి. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 724 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34 వేల మందికి పైగా వైరస్‌తో పోరాడుతున్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
కాగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి జాబితాలో విదేశీయులు కూడా చేరుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు చైనాలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. 60సంవత్సరాల అమెరికా పౌరుడు వుహాన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న మరణించాడు. కరోనా బారిన పడి మరణించిన తొలి విదేశీయుడు ఇతడే కావొచ్చని భావిస్తున్నారు. అయితే మృతి చెందిన వ్యక్తి వివరాలు వెల్లడించలేమని తెలిపింది. చైనాలో ఉన్న మరో 19 మంది విదేశీయులకు కూడా కరోనా వైరస్ వ్యాపించినట్లు చైనా ప్రభుతం గతంలో వెల్లడించింది. అయితే వారిలో ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా, మిగిలిన 17 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
కరోనా ధాటికి జపాన్ కి చెందిన వ్యక్తి కూడా చనిపోయినట్లు చైనా అధికారులు, జపాన్ అధికారులకు సమాచారం చేరవేశారు. చికిత్స అందిస్తుండగానే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలిపారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరిగింది.