iDreamPost
android-app
ios-app

బీహార్ ఫలితాల్లో అస్పష్టత, ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీయే

  • Published Nov 10, 2020 | 2:41 PM Updated Updated Nov 10, 2020 | 2:41 PM
బీహార్ ఫలితాల్లో అస్పష్టత, ఆధిక్యంలో  కొనసాగుతున్న ఎన్డీయే

బీహార్ లో అధికార పీఠాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో తీవ్రంగా శ్రమించిన ఎన్డీయే కూటమికి ఆధిక్యత కనిపిస్తోంది. తుది ఫలితాలు వెలువడుతున్న దశలో బీజేపీ, జేడీయూ కూటమి సాధిస్తున్న ఫలితాలతో మరోసారి పీఠం నిలబెట్టుకుంటామనే ఆశాభావం ఆ శిబిరంలో కనిపిస్తోంది. అదే సమయంలో సొంత బలం పెంచుకుంటూ ముందడుగు వేస్తున్న ఆర్జేడీ కూడా ఇంకా ఆశల పల్లకిలోనే ఉంది. ఆపార్టీకి గత అసెంబ్లీలో ఉన్న 73 సీట్ల బలం కొంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈసారి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాని నిలబెట్టుకునే దిశలో ఉంది. కానీ కాంగ్రెస్ పుంజుకోకపోవడం ఆర్జేడీ ఆశలపై నీళ్లు జల్లింది. గత ఎన్నికలతో పోలిస్తే లెఫ్ట్ పార్టీలు అనూహ్యంగా బలాన్ని పెంచుకున్నాయి. 3 స్థానాల నుంచి ప్రస్తుతం ఆధిపత్యాలతో కలిసి 17చోట్ల పాగా వేసే దిశలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం 23 నుంచి తన బలాన్ని కోల్పోయింది. 20 స్థానాలకే పరిమితం అవుతున్నట్టు తాజా ట్రెండ్స్ చెబుతున్నాయి.

రాత్రి 8:30గం.ల సమయానికి ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన 74 సీట్లకు గానూ బీజేపీ 22, ఆర్జేడీ 20 చోట్ల గెలిచాయి. ఎన్డీయేలోని జేడీయూ 13, వీఐపీ 2 చోట్ల గెలిచాయి. ఇక కాంగ్రెస్ 7, సీపీఎం 1 దక్కించుకున్నాయి. ఎంఐఎం కూడా మరో స్థానంలో గెలిచింది. దాంతో ఆధిపత్యాలతో కలిసి బీజేపీ 72, ఆర్జేడీ 73 స్థానాల్లో విజయం వైపు దూసుకెళుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 13 పార్టీలో బోణీ కొట్టే అవకాశం ఉండగా, అందులో ఎంఐఎం కూడా 5 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీఎల్జేపీ బోణీ కొట్టలేని పరిస్థితుల్లో ఉండగా తెలంగాణా అసెంబ్లీ తర్వాత అత్యధిక స్థానాలతో బీహార్ అసెంబ్లీలో పాగా వేసే దిశలో ఎంఐఎం పయనిస్తుండడం కీలక పరిణామం.

ఇక బీఎస్పీ , హిందుస్తాన్ ఆవామీ మోర్చా, సీపీఐ, లిబరేషన్ పార్టీలు కూడా సభలో ప్రాతినిధ్యం సాధించే దిశలో ఉన్నాయి. వాటిలో అత్యధికంగా సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఏకంగా తన బలాన్ని 3 సీట్ల నుంచి 12 సీట్ల కు పెంచుకునే దిశలో ఉండడం విశేషం. తుది ఫలితాలు రావడానికి మరిన్ని గంటల సమయం తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఎక్కువ రౌండ్లలో లెక్కింపు జరుగుతోంది. దాంతో జాగ్రత్తల మధ్య సాగుతున్న కౌంటింగ్ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఈసీ ప్రకటించింది. ఇక ఎన్డీయే కూటమి ప్రస్తుతం 120 స్థానాలకు దరిదాపుల్లో నిలుస్తోంది. మహా కూటమి మాత్రం 112 చోట్ల బలాన్ని చాటుకుంటోంది. దాంతో హంగ్ దిశగా బీహార్ ఎన్నికలు పయనిస్తున్నట్టు భావిస్తున్నారు. తుది ఫలితాల్లో మార్పులు వస్తే తప్ప చిన్న పార్టీలు పెద్ద పాత్ర పోషించే అవకాశం మాత్రం ఖాయంగా ఉంది.

అత్యధిక స్థానాలు గెలిచిన కూటమిగా ఎన్డీయే నిలిస్తే సీఎం రేసు ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా నితీష్‌ కుమార్ స్థానంలో బీజేపీ పగ్గాలు చేపట్టేందుకు మొగ్గు చూపవచ్చని భావిస్తున్నారు. వెంటనే దానికి పూనుకుంటారా లేక కొంత కాలం వేచి చూస్తారా అన్నది బీజేపీలో సాగుతున్న చర్చ. ఏమయినా త్వరలో బీజేపీ సారధ్యంలో బీహార్ సర్కారు ఏర్పడుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. నాలుగో సారి సీఎం పీఠంపై నితీష్‌ కుమార్ వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తుండా, యువ ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వస్తుందని ఆశించిన తేజస్వీ యాదవ్ కి మాత్రం ఆశ, నిరాశల మధ్య కొట్టిమిట్టాడాల్సి వస్తోంది.