భారత లోక్ సభ లో సరికొత్త డిమాండ్.. సరికొత్త చర్చకు ఈరోజు బీజం పడింది. భారత దేశ కరెన్సీ మీద గాంధీ బొమ్మతో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని ఏకంగా లోక్ సభ సభ్యురాలు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్ సభ సభ్యులు డిమాండ్ చేయడం ఒక కొత్త చర్చకు దారితీసింది అనే చెప్పాలి.
అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ లోక్ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని భారత దేశపు కరెన్సీ మీద ఎందుకు ముద్రించాలి అనేదాని మీద సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇది భారతదేశపు వెనుకపడిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ దేశంలో మహాత్మాగాంధీని ఎంతమంది పూజిస్తున్నారో బి ఆర్ అంబేద్కర్ ను అంతకంటే ఎక్కువ మంది గౌరవిస్తున్నారు అని, కొన్ని వర్గాలకు ఆయన ఒక బ్రాండ్ గా ఉన్నారు అని ఎంపీ చెప్పుకొచ్చారు.
మొదటి ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటీషు పాలనలో భారతదేశం ఆర్థిక సంక్షోభానికి గురైందని, దాని నుండి బయటపడటానికి ఇంపీరియల్ బ్యాంక్ 1921ను ఏర్పాటు చేశారు. అది జరిగినప్పటికీ అది ఒక విఫల ప్రయత్నంగానే తర్వాత కాలంలో మిగిలిపోయింది. అయితే ఆ సమయంలో డా.బీఆర్ అంబేద్కర్ క్షీణిస్తున్న రూపాయి విలువను గురించి, దాని వలన సామాన్యుడి జీవనం ఎలా దుర్భరమౌతుందో, ఆర్థికంగా భారతదేశం ఎలా పతనమౌతుందో బ్రిటీషు వాళ్లకు తెలియజెప్పే పోరాటం చేసి సఫలీకృతులయ్యారు.
Also Read : చేతులెత్తేసిన నిమ్మగడ్డ..! ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సమయం లేదంట..!!
అందుకు పరిష్కారంగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయాలని “హిస్టరీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్” అని ఆయన రాసిన పుస్తకం ద్వారా ‘హిల్టన్ కమిషన్’ కు సిఫారసు చేయడం జరిగింది. బ్రిటీషు వారు ఆ బాధ్యతను సైమన్ కమిషన్ కు బదిలీ చేశారని, సైమన్ కమిషన్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చలు జరిపి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడాన్ని ఆమోదించిందని, అప్పటి కేంద్ర శాసన సభ డా. బీఆర్ అంబేద్కర్ సూచనలను క్రోడీకరించి RBI చట్టం, 1934 ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చరిత్రలో లిఖించని కారణంగా చాలామందికి దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. తదనంతర కాలంలో 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయడం జరిగిందని ఎంపీ సభకు గుర్తుచేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే గొప్ప ఆశయంతో మేధో మధనం చేసి రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించి, అందుకు తగిన పోరాటం జరిపి సాధించిన ఆ దార్శనికుడి చిత్ర పటాన్ని ఏదైనా భారత కరెన్సీ నోటు పైన ముద్రించి, జాతిపిత మహాత్మాగాంధీతో సమాన గౌరవం ఇవ్వాలని కోరుతూ, ఇప్పటికైనా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి.
సుమారు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన అనురాధ ఎన్నో కొత్త విషయాలను సభ ముందు ఉంచడంతో పాటు తాను చదువుకున్న పుస్తకాల్లో వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు. కచ్చితంగా భారత దేశపు గొప్ప వ్యక్తులలో బి.ఆర్.అంబేద్కర్ ఎప్పటికీ మేటిగా మిగిలిపోతారని, ఆయన ఎన్నో నిమ్న కులాలకు మార్గదర్శిగా, మేధావులకు దార్శనికుడు గా ఉంటారని ఆయన చిత్రాన్ని భారతదేశపు అత్యున్నత కరెన్సీ మీద ముద్రించినట్లయితే ఖచ్చితంగా ఆయన గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు, ఒక గొప్ప గౌరవం ఆయనకు ఇచ్చినట్లవుతుంది అంటూ అనురాధ చేసిన ప్రసంగానికి లోక్ సభ సాక్షిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. దీంతో పాటు ప్రస్తుతం సమాజంలోనూ దీనిమీద కొత్త చర్చ లేవడానికి ఆమె వ్యాఖ్యలు దారితీశాయి. భారతదేశ చట్ట సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తాడం ద్వారా మొత్తం దేశ ప్రజలను ఈ అంశం గురించి ఆలోచింప చేసే అవకాశం ఉంది అన్నది విశ్లేషకుల మాట. ఎంతో గొప్ప ప్రసంగం చేసిన ఆమెను సహచర ఎంపీలు అభినందనలతో ముంచెత్తారు.
Also Read : సుప్రీంకోర్టు కి కాబోయే సీజే ఆయనేనా..? జస్టిస్ ఎన్ వీ రమణకు లైన్ క్లియర్ అయినట్టేనా..?