iDreamPost
iDreamPost
గత ఏడాది కరోనా ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఓటిటి సంస్థలు తమ దూకుడుని తగ్గించుకునే ఉద్దేశంలో ఎంత మాత్రం లేవు. వందల కోట్ల పెట్టుబడులను హక్కుల కోసం మంచి నీళ్లలా కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులోనూ అమెజాన్ ప్రైమ్ మరింత స్పీడ్ గా ఉంటోంది. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు బ్యానర్ల కోసం ఎంతకైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ కు నాలుగు సినిమాలకు గాను ప్రైమ్ 400 కోట్ల డీల్ ఇచ్చిందనే వార్త ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి ఆదిత్య చోప్రా ఒక్క క్షణం ఆలోచించకుండా నో చెప్పేశారట.
షంషేరా, పృథ్విరాజ్, బంటీ ఔర్ బబ్లీ 2, జయేష్ భాయ్ జోర్దార్ లకు గాను హోల్ సేల్ గా ఈ ప్యాకేజ్ ని ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ డిజిటల్ కు ఇచ్చే సమస్యే లేదని తేల్చేయడంతో ఇప్పుడు రెండో ప్రతిపాదన కూడా ఇచ్చినట్టు తెలిసింది. వీటితో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుఖ్ ఖాన్ పఠాన్ లు మొత్తం 6 సినిమాలకు కలిపి థియేటర్ రిలీజ్ తర్వాత 425 కోట్లకు ప్రపోజల్ పెట్టారట. గ్యాప్ 30 నుంచి 60 రోజుల మధ్యలో ఉండేలా ఆదిత్య చోప్రా కొంత పాజిటివ్ గా స్పందించినట్టు తెలిసింది. థియేట్రికల్ పూర్తయిన రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ కోసం ఇంత మొత్తాన్ని వెచ్చించడం అంటే చిన్న విషయం కాదు.
ఇదింకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ అక్కడి మీడియా వర్గాలు మాత్రమే నిజమే అనేలా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఏది ఏమైనా శాటిలైట్ విప్లవం తర్వాత దానికి పదింతలు తీవ్రమైన స్థాయిలో ఓటిటి చొచ్చుకు వస్తోందన్నది నిజం. దీని వల్ల క్వాలిటీ కంటెంట్ కు డిమాండ్ పెరుగుతోంది. ఆషామాషీగా సినిమాలు తీస్తే జనం థియేటర్లో చూడమని చెప్పేస్తున్నారు. కావాలంటే ఓటిటిలో వచ్చాక తాపీగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీని వల్లే సదరు సంస్థలు కూడా డీల్ విషయంలో రాజీ పడేందుకు ఇష్టపడటం లేదు. మరి నాలుగు వందల కోట్ల ఒప్పందం ఎప్పుడు అధికారికం అవుతుందో చూడాలి
Also Read : Tollywood : మన సినిమాకు మాత్రమే ఇది సాధ్యమయ్యింది