iDreamPost
android-app
ios-app

అమరావతి భూములపై జగన్‌ సర్కార్‌ ఆలోచన.. ఇదే..!

అమరావతి భూములపై జగన్‌ సర్కార్‌ ఆలోచన.. ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని కోసమంటూ గత చంద్రబాబు ప్రభత్వుం రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికే ఇచ్చేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ మేరకు త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ల్యాండ్‌పూలింగ్‌ పద్ధతిలో తీసుకున్న భూమిలో ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలకు, రోడ్లకు ఉపయోగించిన భూమి మినహా మిగతా పోలాన్ని ఆయా రైతులు అడిగితే ఇచ్చేందుకు సద్ధమైనట్లు తెలుస్తోంది. నిన్న శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం.

ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో గత ప్రభుత్వం రైతుల నుంచి దాదాపు 33 వేల ఎకరాలు తీసుకుంది. మూడు పంటలు పండే తమ భూమిని ఇవ్వబోమంటూ పలు గ్రామాల రైతులు భీష్మించారు. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు. ఈ క్రమంలో రాజధానిలో ఆయా రైతులకు చెందిన భూముల్లోని పంటలు గుర్తు తెలియని వ్యక్తులు తగులపెట్టారు. అరటి పంటలను నరికేశారు. ఈ విషయంపై కేసులు నమోదైనా ఎవరూ చేశారన్నది ఏళ్లు గడిచినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తేల్చలేదు.

పలువురు రైతులు తమ భూముల ఇవ్వబోమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాజకీయ పార్టీల నేతలు, సమాజిక వేత్తలు, వివిధ ఎన్‌జీవో సంస్థలు మూడు పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ అంశంపై వారు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారు. రైతులకు మద్దతుగా నిలిచారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలోనూ, పలు బహిరంగ సభల్లోనూ తాము అధికారంలోకి వస్తే రాజధాని పేరిట రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను తిరిగి వారికి ఇచ్చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నా.. మరికొన్ని గ్రామాల రైతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. తమ భూములు ఇస్తే తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

భూముల తిరిగి తీసుకునే విషయంపై మరికొన్ని గ్రామాల్లో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు తీసుకుని దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ఆయా భూముల సరిహద్దులు కూడా చెరిగిపోయాయి. ఐదేళ్ల పాటు సాగులో లేకపోవడంతో సారవంతమైన ఆ భూముల్లో ముళ్లచెట్లు మొలిచాయి. వాటిని తిరిగి యథాతథా స్థితికి తీసుకురావడం కష్టమని రైతులు అంటున్నారు.

ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో నిరసనలు కొనసాగుతుండడంతో భూములు తీసుకోవాలనుకుంటున్న రైతులు ఇప్పుడు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మూడు రాజధానుల ఏర్పాటుపై నిరసనలు తెలియజేస్తున్న రైతులు తమను వ్యతిరేకించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నిరసనలు చల్లారని తర్వాత తమ అభిప్రాయాలు రైతులు బహిరంగంగా చెప్పాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పిన తర్వాత రైతులు సుముఖత వ్యక్తం చేస్తారా..? లేదా..? అన్నది తెలుస్తుంది.