ఒంగోలు లో గురువారం రాజధాని అంశం పై జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ని కవర్ చేస్తూ విధి నిర్వహణలో హఠాతుగా గుండె పోటుతో మరణించిన ఈటివి-భారత్ కి చెందిన రిపోర్టర్ మరియు విడియోగ్రాఫర్ వీరగంధం సందీప్ మృతిని రాజధాని వివాదంలోకి లాగి తమకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా లభ్ది పొందాలని చేసిన పధక రచన ఆదిలోనే తెలుగుదేశం పార్టీ ని ఆ పార్టీ నాయకులని అభాసుపాలు చేసింది.
వివరాలులోకి వెళితే.. గురువారం రాత్రి ఒంగోలు పట్టణంలోజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దమాచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీ తలపెట్టారు. ర్యాలీ కొద్దీ దూరం పోయాక నిత్యం బాగా రద్దీగా వుండే కర్నూల్ రోడ్డు లో ట్రాఫిక్ స్తంభించడంతో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలకి పోలీసులకి మధ్య జరిగిన స్వల్ప తోపులాట జరగ్గా దాన్ని ప్రత్యక్షంగా కవర్ చేస్తున్న ఈటివి రిపోర్టర్ వీరగంధం సందీప్ సంఘటనా స్థలంలోనే హఠాతుగ్గా కుప్పకూలడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు.
అయితే విలేకరి మృతిని తమ ఉద్యమానికి అనుకూలంగా మలచుకోవాలని స్కెచ్ వేసిన స్థానిక తెలుగుదేశం నేతలు పోలీసుల నెట్టడంతో తొక్కిసలాటలో కిందపడి సందీప్ మృతి చెందాడంటూ ప్రచారం చేశారు. తొక్కిసలాట లో విలేకరి మృతి అంటూ కొన్ని న్యూస్ ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారమైంది. ఇంతటితో ఆగని తెలుగుదేశం నేతలు ఆగమేఘాలమీద తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని హుటాహుటిన జిల్లా పర్యటనకి రప్పించారు. కళా వెంకటరావు ని వెంటబెట్టుకొని ఒంగోలు వచ్చిన నారా లోకేష్ కూడా రాజధాని ఉద్యమం సందర్భంగా జరిగిన తోపులాటలోనే విలేకరి మృతి చెందినట్టు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మృతి చెందిన విలేకరి స్వగ్రామం కొప్పోలు వెళ్లి నివాళులర్పించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. శాంతి యుతంగా అమరావతి ర్యాలీ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారని మండిపడ్డారు. పోలీసులకి ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ఊపిరాడక ఈటీవి విలేకరి సందీప్ మృతి చెందాడని లోకేష్ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో లోకేష్ తన ఫోన్ లో ఎక్కడో గతంలో బీహార్లో జరిగిన అల్లర్లలో గాయపడి రక్తం కారుతున్న మహిళ ఫొటోలు చూపిస్తూ, అమరావతి ఆందోళనలో మహిళలని పోలీసులు కొడుతున్నారంటూ పేర్కొన్నారు. అయితే విలేకరి మృతిని రాజకీయంలోకి లాగాలని చూసిన లోకేష్ తీరుతో స్థానికులతో పాటు లోకల్ జర్నలిస్ట్ లు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.
అక్కడ ఎలాంటి తోపులాట జరగలేదని, సందీప్ వీడియో తీస్తూనే కుప్పకూలిపోయ్యాడని అదే కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నఇతర మీడియా ప్రతినిధులు, సహచర రిపోర్టర్లు చెబుతున్నారు. సమాచార సేకరణలో భాగంగా ఆరోజు ఉదయం నుండి పలు కార్యక్రమాలు కవర్ చేసిన సందీప్ సాయంత్రం తెలుగుదేశం ఆధ్వర్యంలో అమరావతి సాధన సమితి చేపట్టిన ర్యాలీని కవర్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, వెంటనే తాము దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోయేసరికే సందీప్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న తోటి విలేకరులు స్పష్టం చేశారు. జిల్లా విలేకరుల సంఘం కూడా టిడిపి చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, టివి జర్నలిస్ట్ సందీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అధ్యక్షతన విలేకరుల సంఘాలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ని కలసి మృతి చెందిన టివి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి తానూ ఇప్పటికే సియం కార్యాలయం అధికారులతో మాట్లాడానని తెలిపారు. సియం సహాయ నిధి నుండి వచ్చే సహాయాన్ని సందీప్ కుటుంబానికి అందజేస్తామని జర్నలిస్ట్ సంఘానికి హామీ ఇచ్చారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏమూల ఏది జరిగినా అది అమరావతి కోసమే అన్నట్టు గా కొన్ని టీవీ చానళ్లతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే కావాలనే కొందరు ఒక పధకం ప్రకారమే ఏదొక విధంగా రాజధాని ఉద్యమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల్లో భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రయత్నాలలో భాగంగానే అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారంతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలైంది. అయితే ఆ వీడియో తమిళనాడులోని మదురైలో తన భార్య మరణం తట్టుకోలేక ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫారం ఎక్కి సూసైడ్ చేసుకొన్న శక్తి అనే యువకుడిదని తెలియజేస్తూ సంబంధిత వార్త పత్రికల సమాచారం, దుర్ఘటన తాలూకూ ఒరిజినల్ వీడియో క్లిప్స్ అని మీడియాలో తరువాత కధనాలు వచ్చాయి. ఇంతటితో ఆగకుండా ఎక్కడో బీహార్లో పశ్చిమ బెంగాల్ లో గతంలో జరిగిన అల్లర్ల తాలూకు ఫోటోలను తీసుకొచ్చి అమరావతిలో మహిళలపై రైతుల పై పోలీసుల ఉక్కుపాదం అంటూ ప్రజల్లో ఉద్రిక్తతలని రెచ్చగొట్టేలా విషప్రచారం చెయ్యడం, అమరావతి ప్రాంతంలోని వృద్ధుల సహజ మరణాల పై మీడియా లో జరుగుతున్న ప్రచారం కూడా కూడా ఈ కోవలోనిదే..
కాలం మారింది సమాచార సాధనాలు తక్కువగా ఉన్న రోజుల్లో,ఉన్న పత్రికల్లో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న రోజుల్లో లాగా ఇప్పుడు అష్టమ,అర్ధ సత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టటం సాధ్యం కాదు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు క్షణాల్లో ప్రపంచ సమాచారం తెలుసుకొంటున్న 2020 రోజుల్లో పాతకాలపు రాజకీయ ఎత్తుగడలు ప్రజల్లో బెడిసికొడతాయనే సంగతి రాజకీయ పార్టీలు తెలుసుకుంటే వాటి భవిష్యత్ కె మంచిది.