iDreamPost
iDreamPost
అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించినప్పటికీ ఐదేళ్ల తర్వాత కూడా పేరుకే రాజధాని అన్నట్టుగా మిగిలింది. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతంలో నూతన నగర నిర్మాణానికి పూనుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఇప్పుడు ఇంటి పై కప్పులు కూడా లేని రాజధానిగా మిగిలిందని టీడీపీ నేతలు చెప్పడం విస్మయకరం. ఉండవల్లి తర్వాత సెక్రటేరియేట్, హైకోర్ట్ కి వెళ్లే వరకూ నేటికీ పూర్తిగా గ్రామీణ వాతావరణమే తప్ప సిటీ లుక్ కనిపించదు. కనీసం అలాంటి పరిస్థితులు కూడా ఎదురుకావు. చివరకు కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించి, కొన్ని నిధులు ఇచ్చినా అమరావతి అసలు రూపు దాల్చడానికే ఇంకెన్నేళ్లు పడుతుందన్నది స్పష్టత లేని సమయంలో ఇక స్మార్ట్ సిటీనా అంటూ అందరూ పెదవి విరిచే పరిస్థితి ఉంది. దాంతో అమరావతిని ఓ భ్రమరావతి అంటూ ఇప్పటికే పలువురు వ్యాఖ్యానించేందుకు కారణంగా మారింది.
జగన్ ప్రభుత్వం మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. అమరావతికి నగర రూపు తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. అందుకు గానూ అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని చూస్తోంది. దాంతో ఇప్పుడు కృష్ణా నదికి ఆవల విజయవాడ నగరం ఉంటే, ఇటువైపు మరో నగర నిర్మాణానికి పూనుకుంటోంది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అమరావతి ప్రాంతంలో 1251.5 ఎకరాలను పేదల ఇంటిస్థలాలకు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉండవల్లి నుంచి మందడం వరకూ ఉన్న వివిద గ్రామాల్లో గుంటూరు జిల్లాలోని పలు మండలాల ప్రజలతో పాటుగా, విజయవాడ నగర వాసులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. దాంతో కొత్తగా 54,307 కుటుంబాలకు లబ్ది జరగబోతోంది. అదే సమయంలో అర లక్ష ఇళ్లు అమరావతిలో పూర్తయితే అదో పెద్ద నగరంగా రూపాంతరం చెందడానికి అవకావం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
అమరావతిలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో నిర్మాణం పూర్తయితే ఒకే సారి రెండున్నర లక్షల జనాభా ఈ ప్రాంతానికి తరలివస్తుంది. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటుగా ఇతర వ్యాపార అవసరాల రీత్యా మరో 50 వేల మంది వచ్చినా మొత్తంగా మూడు లక్షల జనాభా పెరుగుతంది. ఇప్పటికే సుమారు మూడు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో మరో మూడు లక్షల మంది చేరడం ద్వారా రాష్ట్రంలోనే విశాఖ, విజయవాడ తర్వాత మూడో పెద్ద నగరంగా అమరావతి మారడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా టీడీపీ ప్రభుత్వ హయంలో నిర్మితమయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ సహా ఇతర నిర్మాణాలన్నీ వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. వాటి ద్వారా మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అమరావతి విషయంలో దీర్ఘకాలిక వ్యూహాల పేరుతో చంద్రబాబు చేసిన ప్రయోగాల స్థానంలో పూర్తిగా ఆచరణాత్మక నగరం దిశగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజకీయ కారణాలతో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మూడు నాలుగేళ్ల కాలంలో అమరావతి ప్రాంతంలో జనసందడి అనివార్యంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి నిర్మానుష్య వాతావరణంగా కనిపిస్తున్న అమరావతికి అసలు సిటీ లుక్ సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలను కలిపి కార్పోరేషన్ చేయాలనే ఆలోచనతో ఉన్న జగన్ ప్రభుత్వం కొత్తగా నిర్మితవుతున్న ప్రాంతాన్ని కూడా కలిపితే విజయవాడతో పోటీ పడే మరో నగరంగా మార్చే అవకాశం కూడా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదని లెక్కలేస్తున్నారు.