iDreamPost
android-app
ios-app

అమ‌రావ‌తి చ‌ట్టం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా..!!

  • Published Nov 22, 2019 | 6:16 AM Updated Updated Nov 22, 2019 | 6:16 AM
అమ‌రావ‌తి చ‌ట్టం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా..!!

అమ‌రావ‌తి వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. కాన్సెప్ట్ సిటీల మీద దృష్టి పెట్టిన జ‌గ‌న్ క్యాపిట‌ల్ సిటీ విష‌యం మాత్రం నిపుణుల క‌మిటీ కి అప్ప‌గించారు. మాజీ ఐఏఎస్ జీఎన్ రావు నేతృత్వంలోని క‌మిటీ రిపోర్ట్ త‌ర్వాత ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఇప్ప‌టికే తేల్చేశారు. అదంతా అలా ఉండ‌గా మ‌రోవైపు అమ‌రావ‌తిలో రాజ‌ధాని భూముల కోసం చంద్ర‌బాబు అవ‌లంభించిన ల్యాండ్ ఫూలింగ్ ప్ర‌క్రియ‌ను రాష్ట్ర‌మంత‌టా విస్త‌రించాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించారు. అందులో భాగంగా ప్ర‌తీ జిల్లాలోనూ క‌లెక్ట‌ర్ ని చైర్మ‌న్ గా క‌మిటీ నియ‌మించ‌బోతున్నారు. సీఆర్డీయే చ‌ట్టాల‌ను అనుస‌రించి అన్ని జిల్లాల్లోనూ భూ స‌మీక‌ర‌ణ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

ఏపీలో ప్ర‌జ‌లంద‌రికీ గృహ వ‌స‌తి క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. దానికి అనుగుణంగా మొత్తం రెవెన్యూ వ్య‌వ‌స్థ భూముల‌పై దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే రాష్ట్ర‌మంత‌టా గ్రామాల వారీగా ప్ర‌భుత్వ భూములు, ఖాళీ భూములు గుర్తించారు. అదే స‌మ‌యంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని పేద‌ల ద‌ర‌ఖాస్తులు కూడా స్వీక‌రించారు. సుమారుగా రాష్ట్రంలో ఒకేసారి 25ల‌క్ష‌ల మందికి గృహ స‌దుపాయం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రుణంలో దానికి అనుగుణంగా ఈ ప్ర‌క్రియ సాగుతోంది. అయితే ప్ర‌భుత్వ భూములు స‌రిపోక‌పోతే ప్రైవేటు భూములు కూడా కొనుగోలు చేయాల‌ని తొలుత జ‌గ‌న్ ఆదేశించారు. దానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ఆధ్వ‌ర్యంలో కొనుగోలు చేయ‌డానికి అనుగుణంగా ఉన్న భూముల‌ను గుర్తించాల‌ని, వాటిని చ‌దును చేసి ప్ర‌జ‌ల‌కు అప్ప‌గించేందుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌ది అంచ‌నాలు రూపొందించాల‌ని కూడా సీఎం చెప్పారు.

ఇప్పుడు దానికి భిన్నంగా ల్యాండ్ ఫూలింగ్ ముందుకొచ్చింది. త‌ద్వారా పేద‌ల ఇళ్ల స్థ‌లాల కేటాయింపున‌కు భూములు ఇవ్వ‌డానికి ముందుకొచ్చే భూయ‌జ‌మానుల‌కు కూడా ప్ర‌యోజ‌నం ద‌క్కేలా ప్ర‌భుత్వం ఆఫ‌ర్ ఇస్తోంది. అమ‌రావ‌తి ప్రాంతంలో రైతాంగానికి ఇచ్చిన‌ట్టుగానే ఇప్పుడు జిల్లాల్లో ఇస్తారా లేక అద‌నంగా ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తారా అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఈ ల్యాండ్ ఫూలింగ్ నుంచి దేవాదాయ శాఖ భూములు, అసైన్డ్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూముల‌తో పాటు నీటివ‌న‌రులున్న భూముల‌ను మిన‌హాయించాల‌ని నిర్ణ‌యించారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు ధృవీక‌రించిన భూముల‌ను మాత్రం స‌మీక‌రించి, ఇల్లు లేని పేద‌లకు అందించాల‌ని తీసుకున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.